Let's talk: editor@tmv.in
మమతా బెనర్జీకి పెద్ద అవమానం: బీజేపీ

మమతా బెనర్జీకి పెద్ద అవమానం: బీజేపీ

Pinjari Chand
15 జనవరి, 2026

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు టీఎంసీ వేసిన పిటిషన్ ను కొట్టి వేయడం పెద్ద అవమానమని బీజేపీ ఆరోపించింది. ఐ–ప్యాక్ డైరెక్టర్ ప్రతిక్ జైన్ కార్యాలయం, నివాసంలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నిర్వహించిన దాడులకు సంబంధించి, తమ డేటాను రక్షించాలని కోరుతూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై బీజేపీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈడీ స్పష్టంగా – దాడుల సమయంలో ప్రతిక్ జైన్ కార్యాలయం లేదా నివాసం నుంచి ఏ డేటా కూడా స్వాధీనం చేసుకోలేదని కోర్టుకు తెలిపిన నేపథ్యంలో, ఈ పిటిషన్‌పై విచారించాల్సిన అవసరం లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో టీఎంసీ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.

ఈ పరిణామంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ బీజేపీ సహ ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ ‘ఇది మమతా బెనర్జీకి పెద్ద పరువు నష్టం’ అంటూ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఈడీ దాడుల సమయంలో మమతా బెనర్జీ స్వయంగా ఐ–ప్యాక్ కార్యాలయానికి వెళ్లి కేంద్ర సంస్థలను బెదిరించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఇది చట్టాలపై ఆమెకు ఉన్న నిర్లక్ష్యాన్ని బయటపెడుతోందని విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్లతో రాజ్యాంగ సంస్థలను భయపెట్టలేమని, హైకోర్టు తన తీర్పుతో అది స్పష్టంగా చెప్పిందని అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా మమతా బెనర్జీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దర్యాప్తును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి స్వయంగా, డీజీపీ సహకారంతో ప్రయత్నించారన్నారు. టీఎంసీ అవినీతి వ్యవహారాలు, ప్రైవేట్ కంపెనీలతో ఉన్న అనైతిక సంబంధాలు త్వరలోనే బహిర్గతమవుతాయని చెప్పారు. ఈ కేసులో ఈడీ తరఫున హాజరైన అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు – జనవరి 8న జరిగిన దాడుల్లో ఏ డేటా స్వాధీనం చేసుకోలేదని కోర్టుకు స్పష్టం చేశారు.

హైకోర్టు న్యాయమూర్తి సువ్రా ఘోష్ మాట్లాడుతూ, ఈడీ, కేంద్ర ప్రభుత్వ వాదనల నేపథ్యంలో ఈ పిటిషన్‌లో ఇక విచారణకు అంశమే లేదని పేర్కొన్నారు. అలాగే, జనవరి 8న ఈడీ దాడుల సమయంలో మమతా బెనర్జీ వ్యవహరించిన తీరుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈడీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను వాయిదా వేశారు. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీ ప్రత్యేక అనుమతి పిటిషన్ దాఖలు చేసినట్లు హైకోర్టు గుర్తించింది.