Let's talk: editor@tmv.in
మమతా ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశ భద్రతకు ముప్పు: బండి సంజయ్

మమతా ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశ భద్రతకు ముప్పు: బండి సంజయ్

Gaddamidi Naveen
8 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన స్వార్థపూరిత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో నివసిస్తున్న బెంగాలీ కుటుంబాలతో సమావేశమైన ఆయన, పశ్చిమ బెంగాల్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న అక్రమ చొరబాట్లు దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించాయని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ (కంచె) నిర్మించే ప్రయత్నం చేస్తుంటే, మమతా బెనర్జీ ప్రభుత్వం దానిని అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో చొరబాటుకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న అక్రమ ప్రవేశాలు దేశ భద్రతకు పెద్ద ముప్పని సంజయ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో క్షీణిస్తున్న పరిస్థితుల వల్ల అనేక కుటుంబాలు తెలంగాణకు తరలివచ్చాయని, ప్రస్తుతం హైదరాబాద్‌లోనే సుమారు 60,000 మంది బెంగాలీలు నివసిస్తున్నారని ఆయన తెలిపారు.

బెంగాల్‌కు భద్రత, స్థిరత్వం, బలమైన పాలన అవసరమని, అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేలా తమ బంధుమిత్రులకు అవగాహన కల్పించాలని ఆయన బెంగాలీ కుటుంబాలకు పిలుపునిచ్చారు. 2014 కంటే ముందు యూపీఏ హయాంలో వేలాది మంది చొరబాటుదారులు హైదరాబాద్‌లోకి ప్రవేశించారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వారికి రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి రెడ్ కార్పెట్ పరిచాయని మండిపడ్డారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని, రోహింగ్యాలకు కొమ్ముకాస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు.