
మన విదేశాంగ విధానం.. ప్రపంచం ముందు నవ్వులపాలైంది: రాహుల్ గాంధీ
పశ్చిమాసియా సంక్షోభ నిర్వహణలో ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. అంతర్జాతీయ చర్చల్లో భారత్ పక్కన పడిపోయిందని ఆరోపిస్తూ, దేశ విదేశాంగ విధానాన్ని ‘ప్రపంచానికి నవ్వులపాలు’గా అభివర్ణించారు. పార్లమెంట్ ప్రాంగణంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఇరాన్–అమెరికా చర్చలకు పాకిస్థాన్ వేదికగా ఉండవచ్చన్న వార్తలపై స్పందిస్తూ మన విదేశాంగ విధానం ప్రధాని మోడీ వ్యక్తిగత విధానంగా మారింది. దాని ఫలితం ఇదే. ఇది ప్రపంచానికి నవ్వులపాలైందని వ్యాఖ్యానించారు.ప్రధాని స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మోడీ ఏమి చేయగలడు, ఏమి చేయలేడో బాగా తెలుసని అన్నారు. ప్రధాని రాజీ పడితే, దేశ విదేశాంగ విధానం కూడా రాజీ పడినట్టే. ఇది అందరికీ స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. యూఎస్ ట్రేడ్ డీల్ అదే చెప్తోంది. లోక్‌సభలో ప్రధాని చేసిన తాజా ప్రసంగాన్ని విమర్శిస్తూ దేశ ప్రధాని అన్న భావన కనిపించాలి. కానీ స్పష్టమైన వైఖరి కనిపించలేదని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. ఇది ప్రారంభం మాత్రమే. ఎల్పీజీ, పెట్రోల్, ఎరువుల ధరలు పెరగవచ్చు. ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని అన్నారు.
కోవిడ్ కాలాన్ని ప్రస్తావించిన ప్రధాని వ్యాఖ్యలపై కూడా ఆయన విమర్శలు చేశారు. మోడీ కోవిడ్‌లాంటి పరిస్థితి వస్తుందని చెప్పారు. కానీ అప్పట్లో ఏమి జరిగింది, ఎంత మంది మరణించారు అన్నది ఆయన మరిచిపోయారు. సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన లేదనిపిస్తోందని అన్నారు. ఇదిలా ఉండగా, బుధవారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి తాను హాజరు కాలేనని, కేరళలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కారణంగా వెళ్లాల్సి ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. అఖిలపక్ష సమావేశం అవసరం ఉన్నా, సమస్యను నిర్మాణాత్మకంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రైతులు, దేశ ప్రజల గురించి మోడీ పనిచేయడం లేదని, ప్రధాని అమెరికా, ఇజ్రాయెల్ చెప్పినట్టే వ్యవహరిస్తారని ఆరోపించారు.
ట్రాన్స్‌జెండర్ హక్కులపై బహిరంగ దాడి
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ (సవరణ) బిల్లు, 2026పై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల రాజ్యాంగ హక్కులు, గుర్తింపుపై బహిరంగ దాడి అని పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ, ఈ బిల్లును పురోగతికి వ్యతిరేకమైనదిగా అభివర్ణించారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ట్రాన్స్‌జెండర్ సమాజానికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఈ బిల్లు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల స్వీయ గుర్తింపు హక్కును తొలగిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న వారి సాంస్కృతిక గుర్తింపులను నశింపజేస్తుంది. మెడికల్ బోర్డు ద్వారా అవమానకర పరీక్షలకు గురిచేస్తుంది. సరైన రక్షణ లేకుండా శిక్షలు, పర్యవేక్షణను ప్రవేశపెడుతోందని ఆయన పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్ సమాజంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ బిల్లును తీసుకువచ్చారని విమర్శించారు. ఇది వారి రక్షణకు కాకుండా, ముద్ర వేసేలా ఉందని అన్నారు. ప్రతి భారతీయుడికి జీవన హక్కు, స్వేచ్ఛ, గుర్తింపు, గౌరవం రాజ్యాంగం కల్పిస్తుంది. కానీ ఈ ప్రభుత్వం తన సంకుచిత ఆలోచనల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆయన అన్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ నెలలోనే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఇదిలా ఉండగా ట్రాన్స్‌జెండర్ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడం, వారికి జరిగే హానిని బట్టి దశలవారీ శిక్షలను నిర్దేశించడం లక్ష్యంగా ఈ బిల్లును ఈ నెల ప్రారంభంలో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ట్రాన్స్‌జెండర్ నిర్వచనంలో వేర్వేరు లైంగిక అభిరుచులు లేదా వ్యక్తిగతంగా భావించే లైంగిక గుర్తింపులు కలిగిన వ్యక్తులను చేర్చరాదని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సరైన గుర్తింపు, రక్షణ కోసం స్పష్టమైన నిర్వచనం అవసరమని బిల్లు పేర్కొంటోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2019 చట్టం కింద ఉన్న ప్రయోజనాలు విస్తృతంగా ఉన్నందున, వ్యక్తిగత ఎంపిక లేదా స్వీయ గుర్తింపుపై ఆధారపడి గుర్తింపును విస్తరించరాదని సూచించింది. అదనంగా, అవసరమైతే నిపుణుల సలహా తీసుకునే అధికారాన్ని కలిగిన ఒక అధికార సంస్థను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ సంస్థను కేంద్ర, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నియమించే ప్రధాన వైద్యాధికారి లేదా ఉప ప్రధాన వైద్యాధికారి నేతృత్వంలోని మెడికల్ బోర్డు రూపంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
