
మన మందులు సేఫ్ కాదా?
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో..! ఫార్మా రంగంలో బడాయి పోయే వ్యాపారవేత్తలు ఇండియాలోనే ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఇప్పుడు అదే ఫార్మా గుట్టు రట్టవుతుంది. ప్రపంచానికి మందులు సరఫరా చేసే పెద్ద దేశంగా పేరుపొందిన ఇండియా ఇప్పుడు తన పరువును తానే తీసుకుంటోంది. విషం కలిసిన మందులతో అభాసుపాలవుతుంది. గత కొన్ని నెలల్లోనే ఈ సమస్య ఎంత లోతుగా ఉందో మరోసారి బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో 20మంది చిన్నారులు దగ్గు మందు కారణంగా చనిపోయారు. వాళ్లు దగ్గు తగ్గించుకోవడానికి ఇచ్చిన మందే వారి ప్రాణాలను తీసింది. 'కోల్డ్రిఫ్' అనే దగ్గు సిరప్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్టు తేలింది. ఈ సిరప్‌లో డై-ఎథిలీన్ గ్లైకాల్ దాదాపు 48 శాతం ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. దీన్ని ఇండస్ట్రియల్ సాల్వెంట్‌గా పిలుస్తారు. ఇది మనిషి శరీరానికి విషం లాంటిది.
నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. 2019లో జమ్ముకశ్మీర్‌లో ఇలాంటి దగ్గు సిరప్ కారణంగా 12మంది పిల్లలు చనిపోయారు. 2022లో గాంబియా, 2023లో ఉజ్బెకిస్తాన్, కామెరూన్ దేశాల్లో కూడా భారతీయ కంపెనీల సిరప్స్ వల్ల 141 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఘటన తర్వాత ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతాయి కానీ.. కొంతకాలానికి మరో విష సిరప్ బయటపడుతుంది. అయితే కేవలం దగ్గు సిరప్‌లు మాత్రమే కాదు.. మిగిలిన మందులు కూడా సురక్షితం కాదని గతంలో తేలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్, జ్వరం మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, చాలా రాష్ట్రాలు తమ పరీక్షా నివేదికలను సమర్పించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా నకిలీ మందుల పూర్తి స్థాయి చిత్రం కూడా మనకు తెలియడం లేదు.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రతి సంవత్సరం వేల మందులు నాణ్యతా పరీక్షల్లో విఫలమవుతున్నాయి. ఒక్క 2024లోనే 3వేల మందులు నాణ్యత లేనివిగా తేలాయి. వాటిలో కొన్ని పూర్తిగా కల్తీగా ఉన్నట్లు కూడా నిర్ధారణ అయింది. ఇది కేవలం సంఖ్య కాదు, ప్రతీ ఫెయిల్ రిపోర్ట్ వెనుక మనుషుల ప్రాణాలు ఉన్నాయి. మనం ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కానీ భద్రత మాత్రం పెరగడం లేదు. దాదాపు ప్రతి 3 గంటలకు ఒక మందు నాణ్యతా లేనిదిగా తేలుతుంది. ప్రతి నెల ఔషధ నియంత్రణ సంస్థ 'డ్రగ్ అలర్ట్స్' విడుదల చేస్తుంది. ఆగస్టులో మాత్రమే 94 మందులు నాణ్యత లేనివిగా తేలాయి. గత ఎనిమిది నెలల్లోనే 1,100 మందులకుపైగా అలాంటి జాబితాలో చేరాయి. ఇటు గత దశాబ్దంలో 32 వేల మందుల నమూనాలు నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయి. వీటిలో 2,500 మందులు పూర్తిగా నకిలీ లేదా కల్తీగా తేలాయి.
మరోవైపు భారత్ ప్రపంచానికి మందులు సరఫరా చేసే దేశం. పది సంవత్సరాల్లోనే ఔషధ ఎగుమతులు రెండింతలయ్యాయి. కానీ విదేశాల్లో భారతీయ మందులపై ప్రతి హెచ్చరిక ఆ నమ్మకాన్ని నెమ్మదిగా చెరిపేస్తోంది. గాంబియా, ఇరాక్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాల్లో విష సిరప్స్ బయటపడినప్పుడు భారత ఫార్మా రంగం చేసే స్కామ్స్ కళ్లకు కనిపిస్తున్నాయి. మనం తయారు చేసే మందులు ప్రపంచాన్ని కాపాడాలని కలలు కంటాం, కానీ ఇప్పుడు అవే ప్రాణాలను తీస్తున్నాయి. మన చట్టంలో ఇప్పటికీ 'నకిలీ మందు' అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. దీంతో నకిలీ కంపెనీలు సులువుగా తప్పించుకుంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కేవలం చర్యలు కాదు.. ఇలాంటి స్కామ్స్ చేసే వారి బుద్ధి కూడా మారాలి. ఎందుకంటే మందు బాటిల్ తెరవగానే అది మంచిదా లేదా ప్రమాదమా అనేది మనకు తెలియదు. కానీ ప్రతి తప్పిదం మన భవిష్యత్తును విషపూరితం చేస్తోంది. మనం కాపాడుకోవాల్సింది మన ప్రాణాలను మాత్రమే కాదు, మన దేశం మీద ఉన్న నమ్మకాన్ని కూడా.
