Let's talk: editor@tmv.in
మన నగరాన్ని మనమే కాపాడుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి

మన నగరాన్ని మనమే కాపాడుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
11 మార్చి, 2026

భాగ్యనగరంలోని జలవనరుల పునరుద్ధరణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా, కూకట్‌పల్లిలో అత్యాధునికంగా ముస్తాబైన నల్లచెరువును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. చెరువులో గంగమ్మతల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. భవిష్యత్తులో నగరం ఎదుర్కోబోయే పట్టణ సవాళ్లను అధిగమించడానికి చెరువుల సంరక్షణే ఏకైక మార్గమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

నీటి వనరుల సంరక్షణ, చెరువులు, కుంటలను పునరుద్ధరించడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని వరదలు, పర్యావరణ ధ్వంసం నుంచి రక్షించగలమని తెలిపారు. అలాగే మూసి నదిని పునరుద్ధరించి ఇతర జలాశయాలను కూడా కాపాడుదాం. భవిష్యత్తులో నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించుకోగలం అని పేర్కొన్నారు. కోర్ పరిధిలోని అన్ని చెరువుల్లో ఆక్రమణలను తొలగించి, వాటిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లో సబర్మతీ, డిల్లీలో యమునా నదులను అభివృద్ధి చేసుకున్నప్పుడు మనం మూసీని ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ఆయన ప్రశ్నించారు. మూసీని పునరుద్ధరించకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవని ఆయ‌న హెచ్చరించారు.

చెరువుల సమీపంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం చేస్తామని, వారిని ఇబ్బందులకు గురిచేయబోమని హామీ ఇచ్చారు. గతంలో హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని గుర్తుచేశారు. చెరువుల పునరుద్ధరణలో నాకెలాంటి దురుద్దేశం లేదు. నేడు నల్లచెరువు రూపురేఖలు మారిపోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వివరించారు.

పునరుద్ధరించిన చెరువుల చుట్టూ మహిళా వ్యాపారుల కోసం స్టాళ్లు, చిన్నారుల కోసం ఆటస్థలాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పౌర సమస్యలేవైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆక్రమణల నుంచి విముక్తి

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ చెరువు పునరుద్ధరణలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆక్రమణలు, పూడిక, భవన నిర్మాణ వ్యర్థాల వల్ల కేవలం 16 ఎకరాలకు తగ్గిపోయిందని తెలిపారు. ఈ చెరువు, ఇప్పుడు ఆక్రమణల తొలగింపుతో 30 ఎకరాలకు విస్తరించినట్లు ఆయ‌న పేర్కొన్నారు. నివాస ప్రాంతాల్లోకి వరద నీరు రాకుండా ఉండేందుకు 8 ఇన్‌లెట్లను నిర్మించారు. దీనివల్ల వరద నీరు నేరుగా చెరువులోకి చేరుతుంది.

మన నగరాన్ని మనమే కాపాడుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku