
మన చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ: నారా లోకేష్
ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధ్రప్రదేశ్ ఘన చరిత్రకు సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా ఉండాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన లైబ్రరీ భవన నమూనాను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలే లక్ష్యం
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. అమరావతి సెంట్రల్ లైబ్రరీని కేవలం పుస్తకాల నిలయంగానే కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఒక అద్భుత ‘జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. "మన వారసత్వం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ భవన నిర్మాణం ఉండాలి. అత్యాధునిక సాంకేతికతను జోడించి, విద్యార్థుల సమగ్ర వికాసానికి ఇది దోహదపడాలి" అని ఆయన పేర్కొన్నారు. ఈ లైబ్రరీలో 15 లక్షలకు పైగా పుస్తకాలతో పాటు, ఆర్కైవ్స్, ఆడిటోరియం వంటి వసతులు ఉండాలని, అన్ని వర్గాల ప్రజలను అనుసంధానించేలా పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలని సూచించారు.
పదో తరగతిపై ప్రత్యేక దృష్టి
రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం రూపొందించిన '100 రోజుల ప్రణాళికపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన సామర్థ్యాల పెంపు, క్లిక్కర్ వీడియోల వినియోగంపై ఆరా తీశారు. విద్యార్థుల హాజరు, ప్రగతిని పర్యవేక్షించేందుకు రూపొందించిన ‘లీప్’యాప్‌పై తల్లిదండ్రులకు మరింత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఏఐ టూటర్.. డీఎస్సీపై సమీక్ష
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 'ఏఐ టూటర్' వినియోగంపై మంత్రి చర్చించారు. నిడమర్రు పాఠశాల అభివృద్ధి పనులు, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ డీఎస్సీ నిర్వహణ వంటి కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామరాజు, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
