Let's talk: editor@tmv.in
మన ఊరు–మన బడి కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేయాలి: హరీశ్ రావు

మన ఊరు–మన బడి కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేయాలి: హరీశ్ రావు

Pinjari Chand
1 జనవరి, 2026

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు–మన బడి కార్యక్రమానికి సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రూ.512 కోట్ల మేర ‘రెడీ ఫర్ పేమెంట్’లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన మన ఊరు–మన బడి కాంట్రాక్టర్లు తమ సమస్యలను హరీశ్ రావుకు వివరించారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లులు చెల్లించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడంతో బ్యాంకు అప్పులకు వడ్డీలు కడుతూ, కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని కాంట్రాక్టర్లు వాపోయారు.

కమీషన్లు రావని బిల్లులు ఇవ్వడం లేదా?

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, కమీషన్ల కోసం పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల కష్టాలు కనిపించడం లేదా? కమీషన్లు రావు కాబట్టే బిల్లులు ఇవ్వడం లేదా? అని తీవ్రంగా ప్రశ్నించారు. మన ఊరు–మన బడి కార్యక్రమానికి సంబంధించిన రూ.512 కోట్ల బిల్లులు ఇప్పటికే చెల్లింపులకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా లేవనెత్తుతామని కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసి అడ్మిషన్లు పెంచాలని, పేద–మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విద్య పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని, గురుకులాల పిల్లలకు సరిగా భోజనం కూడా అందించలేని చేతగాని ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోతున్నారని, ఒకవైపు బ్యాంకు వడ్డీలు, మరోవైపు కార్మికుల జీతాలు, సరఫరాదారుల బాకీలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. చేసిన పనులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లను పట్టించుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని హరీశ్ రావు విమర్శించారు.