
'మన ఊరు-మన బడి' కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి: హరీష్ రావు
గత రెండున్నరేళ్లుగా పనులు పూర్తి చేసినా బిల్లులు రాక, అప్పుల పాలై తీవ్ర మనోవేదనకు గురవుతున్న 'మన ఊరు-మన బడి' సివిల్ కాంట్రాక్టర్ల సమస్యపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం కాంట్రాక్టర్లు ఆయనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మన బడి’ పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించామని హరీష్ రావు గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కక్షసాధింపుతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
అప్పులు తెచ్చి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారని, అప్పులబాధతో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు నిధుల్లేవని చెబుతున్న ప్రభుత్వం, పెయింటింగ్, బెంచీల సరఫరా చేసిన పెద్ద కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. కమిషన్లు ఇవ్వరనే ఉద్దేశంతో చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో ఉంచుతున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
తమ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణి కార్యక్రమంలో మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క ను వేడుకున్నా స్పందన రాకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. చివరికి సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట శాంతియుత నిరసన తెలపగా వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు.
శాసనమండలి చైర్మన్ కూడా సభలోనే ఈ సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారని హరీష్ రావు పేర్కొన్నారు. బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కనీసం ఇప్పటికైనా ఆర్థిక శాఖ నుంచి విడుదలైన నిధులను చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాలని, వారిపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
