Let's talk: editor@tmv.in
మన ఇందూరు - మన మేయర్: నిజామాబాద్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం

మన ఇందూరు - మన మేయర్: నిజామాబాద్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం

Gaddamidi Naveen
31 జనవరి, 2026

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్‌లో రాజకీయ సందడి పెరిగింది. "మన ఇందూరు - మన మేయర్" అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ 6వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా గోపిడి స్రవంతి రెడ్డి తన నామినేషన్‌ను దాఖలు చేశారు.

నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ఈ నామినేషన్ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్థానిక నాయకులు అర్జున్ రెడ్డి తదితరులు హాజరై అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో నామినేషన్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: ఎంపీ అరవింద్

ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. 6వ డివిజన్ ప్రజలు ఆలోచించి, సమర్థవంతమైన నాయకత్వం కోసం స్రవంతి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. నగరంలో కమలం వికసించేలా ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ అభ్యర్థుల గెలుపు ద్వారానే నగరానికి నిధులు, మెరుగైన మౌలిక వసతులు అందుతాయని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

మన ఇందూరు - మన మేయర్: నిజామాబాద్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం - Tholi Paluku