Let's talk: editor@tmv.in
మన ఇంటి ముంగిటికే యుద్ధం.. అయినా ప్రధాని మౌనం: రాహుల్ గాంధీ

మన ఇంటి ముంగిటికే యుద్ధం.. అయినా ప్రధాని మౌనం: రాహుల్ గాంధీ

Pinjari Chand
6 మార్చి, 2026

అమెరికా సబ్‌మరైన్ దాడిలో ఇరాన్ యుద్ధనౌక ఐఆర్ఐఎస్ దేనా మునిగిన ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోడీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనపై ప్రధాని ఇప్పటికీ స్పందించలేదని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో గురువారం చేసిన పోస్టులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారతదేశానికి దగ్గరగా వచ్చాయని అన్నారు. భారత మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక మునిగిపోయింది. యుద్ధం మన ఇంటి ముంగిటికే చేరింది. అయినా ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి సమయంలో దేశానికి దృఢమైన నాయకత్వం అవసరం. కానీ దేశ వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని వదిలేసిన ప్రధాని మనకు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

చమురు సరఫరాపై ఆందోళన

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల భారతదేశ చమురు సరఫరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. భారతదేశం దిగుమతి చేసుకునే చమురులో 40 శాతం కంటే ఎక్కువ సరఫరా హర్ముజ్ జలసంధి ద్వారా వస్తుందని చెప్పారు. ఈ పరిస్థితి ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాలపై కూడా ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. ఇప్పటికే ఖతార్ గ్యాస్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది.

ఖర్గే ప్రశ్నలు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున్‌ ఖర్గే కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన నౌకాదళ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి జరిగినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రత, చమురు నిల్వలు, వ్యాపారంపై ప్రభావం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల్లో సుమారు ఒక కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రత కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని ఖర్గే ప్రశ్నించారు.

జైరాం రమేష్ వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ, 1995లో ప్రారంభమైన మిలాన్ నౌకాదళ విన్యాసం భారత్‌కు ఎంతో ప్రాముఖ్యమైందని తెలిపారు. 2026లో విశాఖపట్నంలో జరిగిన తాజా ఎడిషన్‌లో అమెరికా, ఇరాన్ సహా అనేక దేశాల యుద్ధనౌకలు పాల్గొన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి విన్యాసాల్లో పాల్గొన్న ఇరాన్ నౌకను అమెరికా సబ్‌మరైన్ ముంచడం తీవ్ర ప్రభావం కలిగించే అంశమని, దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.

విదేశాంగ మాజీ కార్యదర్శి స్పందన

విదేశాంగ మాజీ కార్యదర్శి కన్వాల్ సిబల్ మాట్లాడుతూ, ఐఆర్ఐఎస్ దేనా నౌక భారత్ ఆహ్వానం మేరకు నిర్వహించిన నౌకాదళ వ్యాయామాల్లో పాల్గొనడానికి వచ్చిందన్నారు. ఇంటర్‌‌నేషనల్‌ ఫ్లీట్ రివ్యూ 2026, ఎంఐఎల్ఏఎన్ 2026 కార్యక్రమాల్లో పాల్గొని విశాఖపట్నంలో పరేడ్‌లో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొనే నౌకలు సాధారణంగా ఆయుధాలు లేకుండా ఉంటాయని, అందువల్ల ఆ నౌక రక్షణ లేకుండా ఉండే అవకాశం ఉందని చెప్పారు.

ఇరాన్ ఆగ్రహం

ఇరాన్ విదేశాంగ మంత్రి సెయద్ అబ్బాస్ అరాగచీ అమెరికా చర్యపై తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి హెచ్చరిక లేకుండా దాడి చేయడం ఘోరమైన చర్య అని ఆయన అన్నారు. ఈ ఘటనలో సుమారు 180 మంది నౌకలో ఉన్నారు. శ్రీలంక నేవీ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 87 మృతదేహాలు బయటపడ్డాయి, 32 మందిని రక్షించి గాలేలోని ఆసుపత్రికి తరలించారు.

మన ఇంటి ముంగిటికే యుద్ధం.. అయినా ప్రధాని మౌనం: రాహుల్ గాంధీ - Tholi Paluku