Let's talk: editor@tmv.in
మన ఇంటి ఆదిశక్తి ఎక్కడ?

మన ఇంటి ఆదిశక్తి ఎక్కడ?

Dantu Vijaya Lakshmi Prasanna
2 అక్టోబర్, 2025

ఒక చిత్రంలో చెప్పినట్టు సరస్వతి అంటే విద్య , దుర్గా అంటే దైర్యం, గౌరి అంటే తపస్సు, లక్ష్మీ అంటే శుభం ఇలా ప్రకృతిని ,దేవతలను ఆరాదించేది ఆమె లోనిఅందాన్ని చూసి కాదు, గుణాన్ని చూసి, నిజమే సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి తనలో వుంది. కాబట్టే ఆడవాళ్ళని దేవతలుగా కొలిచే సంప్రదాయం మనది. స్త్రీ లు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అనేది పెద్ధల మాట .ఆధిశక్తి రూపమైన ఆడపిల్లలకు ఒకప్పుడు భారతదేశం లో ఎంత విలువ ఎంత గౌరవం. ప్రతీ ఆడపిల్ల మనయింటి పిల్లే అన్నట్టు చూసేవారు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా ఎప్పుడు మర్యాద తగ్గేదికాదు. ప్రతీ ఆడపిల్లలో ఆధిశక్తి రూపంఉంటుంది.

పూర్వీకుల సమాజంలో ఆడపిల్లలను దేవి స్వరూపం, శక్తి, ప్రేమ మరియు సౌందర్యం సమాహారంగా చూడడం, వారి శక్తిని, ప్రతిభను గుర్తించడం ఒక సాంప్రదాయం గా ఉండేది. ఆ రోజుల్లో ఆడపిల్లలు కేవలం కుమార్తెలు మాత్రమే కాదు, సమాజానికి మానవత, ఆధ్యాత్మిక విలువలు, సృజనాత్మకత అందించే వనరులు అని భావించేవారు. పూర్వీకులు ఆడపిల్లలలోని అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత లను గుర్తించి, వాటిని ప్రోత్సహించేవారు. ఆ విధంగా ఆడపిల్లలు కుటుంబంలో గౌరవం, సమాజంలో ప్రతిష్ట పొందేవారు. కానీ సమాజం, కుటుంబ నిర్మాణం, విద్యా విధానం, సాంకేతిక ప్రగతి కారణంగా ఈ తరం ఆడపిల్లలకు ఇవ్వబడే గౌరవం, అవకాశాలు, ఆత్మవిశ్వాసం కొంతమేర తగ్గిపోయాయి.

ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఆకాశమే హద్ధు గా వివిధ రంగాలలో తమదైన శైలిలోరాణిస్తూ పురుషుల కంటే ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఒక ఆడ పిల్ల వంటగదిని దాటి ఎప్పుడో బయటకు వచ్చి తనదైన ప్రతిభ తో గుర్తింపు పొందుతుంది. ఒక ఉపద్యాయురాలిగా, ఒక వైద్యురాలిగా ,ఆర్దికవేత్త గా నిరూపించుకుంటుంది. ఒక నిర్మలా సీతారామన్ దేశ ఆర్దిక వ్యవస్థనే నడిపిస్తుందంటే ఎంత సత్తా కావాలి. సునీత విలియమ్స్ అంతరిక్షం లో అద్బుతాలుసృష్టించి వచ్చింది . ఇలా ఎంతమంది విజేతలు మనకు కనిపిస్తారో. ఆడపిల్లలో ఒక సముద్రాన్ని చూడవచ్చు అందాన్ని అధిక మించి చూస్తే గుణాలతో నిండిన ఒక దేవతే దర్శనమిస్తుంది.

కానీ పూర్వకాలం లో మహిళలకి దొరికిన గౌరవం,మర్యాద నేటి మహిళకు దొరుకుతున్నాయా అంటే అది సమాదానం లేని ప్రశ్న గానే మిగిలిపోతుంది. ఎందుకు ఈ మార్పు అంటే మారుతున్న నాగరిక పోకడలు అని చెప్పాల్సివస్తుంది. మేధో పరంగా ఆడవాళ్ళు ఎవరెస్టు శిఖరాగ్రాన్నిచేరుతున్నా వారి వేష భాషలు వారి గుర్తింపుని పాతాళానికి పడేస్తున్నాయి. ప్రాచాత్య పోకడలు వెర్రితలలు వేసి నూతన నాగరికత అంటూ సమాజంలో జుగుప్స కరమైన వస్త్ర ధారణతో కనిపించడమే ఆడవారి మీద సదబిప్రాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఎవరో కొందరి ఆడవారి విచ్చల విడితనం మొత్తం స్త్రీ జాతికి కళంకాన్ని తెచ్చిపెడుతుంది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.

పూర్వ కాలంలో గౌరవం ఎందుకు ఎక్కువగా ఉండేది?

సాంప్రదాయ నమ్మకాలు:పూర్వీకులు ఆడపిల్లలను దేవి రూపంలో చూసేవారు. ప్రతీ ఆడపిల్లలో ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్మేవారు. ఆడపిల్లలు కుటుంబ బంధాలను గౌరవిస్తూ మృదువుగా, ప్రేమగా కుటుంబాన్ని నడిపించగలరని భావించేవారు. ఆడపిల్లలు పాటలు, నృత్యం, కళలతో పరిచయం చేసుకుంటూ, సమాజ విలువలకు తగిన వస్త్ర దారణతో గౌరవంగా మెలిగేవారు. ఆ తరంపెద్దవాళ్ళు సామాజిక బాధ్యతలతో ఆడపిల్లలను క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో పెంచి, సమాజంలో గౌరవాన్ని పొందేలా తీర్చిదిద్దేవారు.

గౌరవం తగ్గడానికి కారణాలు

ప్రస్తుత కాలంలో, పూర్వీకుల ఆచారాలు, విలువలు కొంతమేర మారిపోయాయి. పెద్దల బహిష్కరణ లేదా సమాజపు అభిప్రాయం ప్రకారం కొన్ని వెనుకబడిన సమాజాల్లో ఇంకా ఆడపిల్లలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ప్రతీ ఒక్కరూ బిజీగా ఉన్న జీవితం దీనితో పెద్దలు పిల్లల సంరక్షణ, శ్రద్ధలో తక్కువ సమయం పెడుతున్నారు. నేటి ఆడపిల్లలు సాంకేతిక ప్రభావంతో సోషల్ మీడియా, ఫ్యాషన్, టెక్నాలజీ రంగాలపై పెట్టిన శ్రద్ద, ఆత్మవిశ్వాసం, గౌరవం, నైతిక విలువలపై పెట్టడంలేదు. కొన్నిసార్లు ఆడపిల్లలు సమాన అవకాశాలు పొందుతున్నా అక్కడి ఉద్యోగ వాతావరణంలో ఇమడలేక అవకాశాలు వదులుకుంటున్నారు. అందుకే గుర్తింపు, గౌరవం తగ్గిపోతుంది.

కొంతమంది సమాజాల్లో ఇంకా ఆడపిల్లల ప్రాధాన్యాన్ని తక్కువగా చూస్తున్నారు. “కుమార్తె కేవలం భర్త ఇంటికి వెళ్ళే దీపమే అన్న దిశగా కాలం లో మార్పులు వచ్చేశాయి . ఆడపిల్ల ఆడపిల్లే ఈడ పిల్లకాదు అని అనుకునేవాళ్ళు మన సమాజంలో ఇంకా వున్నారు. ఆ నమ్మకమే కొన్నిసార్లు ఆడపిల్లల గౌరవాన్ని తగ్గిస్తుంది. బిజీ జీవనశైలి, కుటుంబాల ఆర్థిక సమస్యల వల్ల, ఆడపిల్లల ప్రతిభను, శక్తిని గుర్తించడానికి సమయం తక్కువగా ఉంటుంది. మగపిల్లల కంటే ఆడపిల్ల తక్కువ అనేబావన ఇంకా ఈ సమాజాన్ని ఓ రోగం లా పట్టిపీడిస్తుంది. చదువు, క్రీడలు, కళలలో సమాన అవకాశాలు అందకపోవడం వల్ల, ఆడపిల్లలు సమాజంలో పూర్వపు గౌరవ స్థాయికి చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికీ సమాజంలో ఆడవారికిఉద్యోగాలు లభించినా మగవారితో సమానంగా ఆర్దిక సమానత్వం లేకపోవడమే దీనికి ఉదాహరణ .

విశ్వాసాన్ని పెంపొందించడం:

ఆడపిల్లలను చిన్నతనం నుండే వారి ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలి. కుటుంబంలో, పాఠశాలల్లో ఆడపిల్లలకు గౌరవం, కర్తవ్యబోధన, ఆత్మవిశ్వాసంతో ఎలావుండాలో నేర్పాలి. సమాజంలో ఆడపిల్లల ప్రాధాన్యాన్ని చూపించే కార్యక్రమాలు, ప్రచారాలు చేపట్టాలి. సమాన విద్యావిధానం, కళలు, క్రీడలలో అవకాశాలు ఇవ్వడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దలు, కుటుంబ సభ్యులు, సమాజం కలిసి ఆడపిల్లలకు ప్రేమ, గౌరవం, ఇస్తూనే స్వయం ఉపాదికి అవకాశాలు కల్పించాలి. ఆడపిల్ల తన ఇంటిని బాద్యతతో చక్కపెట్టుకోగలదు అని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి.

పూర్వ కాలంలో ఆడపిల్లలు అమ్మవారి అంశగా గౌరవం పొందేవారు, కానీ ప్రస్తుత తరం కొద్దిగా దాన్ని మర్చిపోయింది. మళ్లీ ఆ గౌరవాన్ని తీసుకురావడం ప్రతి కుటుంబ, ప్రతి పెద్దవారి బాధ్యత. ఆడపిల్లలకు సమాన అవకాశాలు, గౌరవం, ప్రేమ ఇవ్వడం ద్వారా, మన సమాజం శక్తివంతమైనది, సమతుల్యమైనది అవుతుంది. ప్రతి ఆడపిల్లలో ఉన్న ఆధిశక్తి ని గుర్తించడం, ప్రోత్సహించడం మనం తీసుకోవాల్సిన తక్షణ బాధ్యత.

మన ఇంటి ఆదిశక్తి ఎక్కడ? - Tholi Paluku