
మన్ కీ బాత్‌తో సమస్యలు పరిష్కారం కావు: కేసీ.వేణుగోపాల్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ ఆరోపించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంతో సమస్యలు పరిష్కారం కావని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. భారతీయుల సమస్యలపై కేంద్రం నిశ్శబ్దంగా ఉందని అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అదేవిధంగా కేరళలో పెరుగుతున్న జీవన వ్యయంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్పీజీ కొరత, ధరల పెరుగుదల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
కేరళ ఆర్థిక వ్యవస్థను దోచేశారు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళ సీఎంపై వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కేరళ ఆర్థిక వ్యవస్థను దోచేశారని ఆరోపిస్తూ, ప్రజల డబ్బును రాజకీయ ప్రచారానికి వినియోగిస్తున్నారని అన్నారు. పేదల కోసం చేయాల్సిన పనులపై కాంగ్రెస్‌కు స్పష్టమైన హామీ ఇస్తోంది. కర్ణాటక, తెలంగాణలో మా ప్రభుత్వాలు చేసిన పనులు అందుకు ఉదాహరణ. కానీ పినరయ్ ప్రభుత్వం మాత్రం ప్రజా నిధులను తన ప్రచారం కోసం వినియోగిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా సీపీఎం పార్టీ కార్పొరేట్ శైలిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. మార్క్సిస్టు పార్టీ ఇప్పుడు కార్పొరేట్ మార్క్సిస్టు పార్టీగా మారిందని వ్యాఖ్యానించారు.
అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి విజయన్ ఖండించారు. యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తప్పుడు ప్రచారం చేస్తోందని, ప్రజలు నిజాన్ని గుర్తించగలరని ఆయన అన్నారు. 140 సభ్యుల కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 23తో ముగియనుంది. దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని తొలగించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో సుమారు 2.7 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు.
