Let's talk: editor@tmv.in
మన్యం జిల్లా పచ్చిపెంట ఘాట్ రోడ్డులో బియ్యం లారీ బోల్తా

మన్యం జిల్లా పచ్చిపెంట ఘాట్ రోడ్డులో బియ్యం లారీ బోల్తా

Panthagani Anusha
8 ఏప్రిల్, 2026

పార్వతీపురం మన్యం జిల్లా పచ్చిపెంట మండల పరిధిలోని ఆంధ్ర–ఒడిశా అంతర్రాష్ట్ర సరిహద్దులో సోమవారం అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. బియ్యం లోడుతో వెళ్తున్న ఒక భారీ లారీ ఘాట్ రోడ్డు మలుపులో అదుపుతప్పి బోల్తా పడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ ఘటన వల్ల రహదారికి ఇరువైపులా సుమారు 7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు రాత్రంతా అడవి ప్రాంతంలోనే చిక్కుకుపోయారు.

ప్రమాదానికి ప్రధాన కారణం వాహన సాంకేతిక లోపమేనని తెలుస్తోంది. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్న లారీ, రాత్రి 11 గంటల సమయంలో ఘాట్ రోడ్డులోకి ప్రవేశించగానే ఒక్కసారిగా బ్రేకులు పడకపోవడంతో మలుపు వద్ద డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో లారీ రోడ్డుకు అడ్డంగా పల్టీ కొట్టింది. లోడులో ఉన్న బియ్యం సంచులు రహదారిపై చెల్లాచెదురుగా పడటంతో పాటు లారీ అడ్డంగా పడిపోవడంతో చిన్న వాహనం కూడా వెళ్లడానికి వీలు లేకుండా దారి మూసుకుపోయింది.

ఈ అకస్మాత్తు ప్రమాదంఆ దారిగుండా ప్రయాణించే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వస్తున్న వందలాది బస్సులు, కార్లు, సరకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఘాట్ రోడ్డు కావడంతో కనీసం మంచినీరు, ఆహారం దొరకక ప్రయాణికులు రాత్రంతా ఆకలి దప్పులతో అల్లాడిపోయారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆ చలిలో వాహనాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మొబైల్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో సమాచారం చేరవేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

కాగా మంగళవారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ క్రేన్ సహాయంతో బోల్తా పడిన లారీని పక్కకు తొలగించి, రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న బియ్యం సంచులను శుభ్రం చేశారు. సుమారు ఏడు గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉదయం 6 గంటల ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే భారీ వాహనాల ఫిట్‌నెస్‌ను కఠినంగా తనిఖీ చేయాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రక్షణ గోడలు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.