Let's talk: editor@tmv.in
మనుషులంతా సమానమే,

మనుషులంతా సమానమే,

Dr.Chokka Lingam
4 అక్టోబర్, 2025

సమకాలీన అంశాలపై నిపుణులతో చర్చించే ‘మంథన్ సంవాద్ 2025’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ శిల్ప కళా వేదికలో జరిగింది. చర్చా కార్యక్రమంలో వివిధ రంగాల నిపుణులు లోతైన విశ్లేషణ చేశారు.

మలిక్యులార్ బయాలజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎల్. ఎస్. శశిధర తన ప్రసంగంలో ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనలను ఉటంకిస్తూ మనుషులు జన్యుపరంగా సమానులేనని, అసమానతలను సమాజం కల్పించిందని విశ్లేషించారు. కుల వ్యవస్థ కేవలం 2000 సంవత్సరాల క్రితం ఏర్పడిందని వివరించారు. పరిణామ సిద్ధాంతం శాస్త్రీయమైనదనీ, పాఠ్యాంశాలలో తప్పక బోధించాలని పేర్కొన్నారు.

ఆర్థిక శాస్త్రవేత్త రథిన్ రాయ్ దక్షిణ భారత దేశంలో ఆర్థిక ప్రగతిని విశ్లేషిస్తూ.. తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని, కానీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తూ, సమగ్ర అభివృద్ధి కోసం విధాన మార్పులు అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న వస్తు సేవల ధరలలో, కొద్ది భాగం మాత్రమే శ్రామికులకు చేరుతున్నదని, సింహ భాగం ధనికులే అనుభవిస్తూ అసమానతలు పెంచుతున్నారని విశ్లేషించారు.

రక్షణ రంగ విశ్లేషకుడు ప్రవీణ్ సాహ్నీ జాతీయ భద్రతా సవాళ్లను, భారత దేశ విదేశాంగ విధానాన్ని చర్చిస్తూ, 2030 నాటికి చైనా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచంలో నంబర్ వన్ అవుతుందని, భారతదేశం కొత్త సవాళ్ళకు అనుగుణంగా రక్షణ వ్యవస్థను , విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల ఉద్యమ నేత కాలిన్స్ గోన్సాల్వ్స్ ప్రభుత్వం మానవ హక్కులను అణచి వేస్తోందని, న్యాయవ్యవస్థ చురుకుగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ప్రజలు ఆందోళన చేయాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

పత్రికా రచయిత చరిత్రకారుడు ప్రొఫెసర్ రుద్రాంగ్షు ముఖర్జీ నేటి సమాజానికి గాంధీ, ఠాగూర్ ఆలోచనల ఆవశ్యకతను గుర్తు చేశారు. నైతికత, అహింస, మానవతా విలువలు నేటి సమాజానికి మార్గదర్శకాలని చెప్పారు. ప్రముఖ పాత్రికేయుడు అర్ఫా ఖానుం నిజాధారిత జర్నలిజం ,పత్రికా స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం బలపడదని హెచ్చరించారు. హాస్యనటుడు వీర్ దాస్ తన వ్యంగ్యంతో సమాజంపై తన దృక్పథాన్ని పంచుకున్నారు. రాజకీయాలు, సంస్కృతి, వ్యక్తిత్వం గురించి హాస్యరసంతో ఆలోచింపజేశారు.

ప్రజలు వివిధ అంశాలపై తమ ఆలోచనలు పంచుకునే ఒక స్వతంత్ర వేదికగా మంథన్ సంవాద్ 2005లో స్థాపించబడింది. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి రోజున మంథన్ సంవాద్ పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది. ఇందులో శాస్త్రవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, చరిత్రకారులు, కళాకారులు, విద్యార్థులు, పాత్రికేయులు మొదలగువారు పాల్గొంటారు.

మనుషులంతా సమానమే, - Tholi Paluku