Let's talk: editor@tmv.in
మనాలీలో భారీగా కురుస్తున్న మంచు

మనాలీలో భారీగా కురుస్తున్న మంచు

Pinjari Chand
26 జనవరి, 2026

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ మంచు కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలీలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. జాతీయ రహదారులు మూసుకుపోవడంతో వందలాది మంది పర్యాటకులు తీవ్రమైన చలిలో చిక్కుకుపోయారు. ఒకటి నుంచి రెండు అడుగుల మేర మంచు పేరుకుపోవడం, రహదారులపై ప్రమాదకరమైన బ్లాక్ ఐసింగ్ ఏర్పడటం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మనాలి సమీపంలో సుమారు 7–8 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి మంచుతో కప్పుకుపోయి మూసుకుపోయింది. దీంతో అనేక మంది పర్యాటకులు తమ వాహనాలను వదిలేసి, లోతైన మంచులో కాలినడకన ప్రయాణించాల్సి వచ్చింది. మనాలీకి చేరేందుకు ప్రయత్నించిన కొంతమంది పర్యాటకులు, సామాన్లతో పాటు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు మనాలీ నుంచి బయటకు వెళ్లాలనుకున్న పర్యాటకులు కూడా మనాలీ–పట్లీ ఖోల్ మధ్య ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. అనేక వాహనాలు 24 గంటలకు పైగా అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్రమైన చలిలో, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు లేకుండా తమ వాహనాల్లోనే రాత్రి గడపాల్సి వచ్చింది.

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

చండీగఢ్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ బంటీ మాట్లాడుతూ గత 24 గంటలుగా భారీగా మంచు కురుస్తోంది. మా వాహనంలో ఉన్న ప్రయాణికులు ఆహారం, తాగునీరు లేకుండా నిస్సహాయంగా ఉన్నారు. నిన్నటి నుంచి ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నాం. రోడ్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం రాలేదని వాపోయాడు. గుజరాత్‌కు చెందిన పర్యాటకుడు హర్పాల్ సింగ్ తన అనుభవాన్ని పంచుకుంటూ కుటుంబంతో కలిసి నిన్న ఇక్కడికి వచ్చాం. ట్రాఫిక్ జామ్‌లోనే కారులో రాత్రి గడిపాం. చుట్టుపక్కల ఆహారం గానీ, పబ్లిక్ టాయిలెట్లు గానీ లేవు. నిన్నటి నుంచి కేవలం 200 మీటర్లు మాత్రమే కదిలాం. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరాడు. స్థానికులు కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే ప్రాంతానికి చెందిన శివ్బియాస్ మాట్లాడుతూ భారీ మంచు కారణంగా పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వాహనాల్లోనే రాత్రి గడిపారు. ట్రాఫిక్ 24 గంటలకు పైగా నిలిచిపోయింది. చలి కారణంగా కొంతమందికి అస్వస్థత కూడా కలుగుతోందని తెలిపారు. మంచు కురుస్తున్నందువల్ల రవాణా పూర్తిగా పునరుద్ధరించలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణం కుదుటపడిన తర్వాత రహదారుల శుభ్రపరిచే పనులు, సహాయక చర్యలు మరింత వేగవంతం చేయనున్నట్లు పేర్కొన్నారు.