
'మనమిత్ర' వాట్సాప్ ద్వారా సులభంగా సదరం స్లాట్ బుకింగ్
రాష్ట్రంలోని దివ్యాంగులు సదరం సేవలను మరింత సులభంగా పొందేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సదరం స్లాట్ బుకింగ్ కోసం మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే సదరం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) వెల్లడించింది.
ఈ కొత్త విధానంతో దివ్యాంగులు సదరం స్లాట్ బుకింగ్‌తో పాటు స్లాట్‌ల లభ్యతను తెలుసుకోవడం, సదరం సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి సేవలను తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు "హాయ్" అని సందేశం పంపాలి. అనంతరం కనిపించే పౌర సేవలు విభాగంలో సదరం సర్వీసులు ఎంపిక చేసుకుంటే సదరం స్లాట్ అవైలబిలిటీ, సదరం స్లాట్ బుకింగ్, సదరం సర్టిఫికెట్ డౌన్‌లోడ్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అవసరానికి అనుగుణంగా సంబంధిత సేవను ఎంచుకుని, కోరిన వివరాలను నమోదు చేస్తే నిమిషాల వ్యవధిలోనే సేవలను పొందవచ్చు.
ఈ విధానం ద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గడంతో పాటు సమయం, ప్రయాణ వ్యయం కూడా ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరూ ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుని సదరం సంబంధిత సేవలను సులభంగా పొందాలని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు.
