
మనమిత్ర వాట్సప్ గవర్నెస్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి:సిఎస్
రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన ‘మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్’పై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలనలో సాంకేతికతను జోడించి ప్రజల ఇబ్బందులను తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వాట్సప్ వేదికగా వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట లభిస్తున్నాయని ప్రతి కుటుంబం ఈ డిజిటల్ సేవలను వినియోగించుకునేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
ఏప్రిల్‌లోగా అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్ఎకెఎఫ్డిసి పథకాల కింద వాహనాల కొనుగోలు,స్వయం ఉపాధికై రుణాలు తీసుకున్న లబ్దిదారులు ఏప్రిల్ లోగా అసలు చెల్లిస్తే వారికి వడ్డీ మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులకు సిఎస్ సూచించారు. ఎన్ఎస్ఎఫ్డిసి,ఎన్ఎస్ఎకె ఎఫ్డిసి రెండు కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ. 260 కోట్లలు అసలు రూ. 40 కోట్లలు వడ్డీ కలిపి రూ.300 కోట్లు వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా రికవరీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా ఇందుకు సహకరిస్తారని చెప్పారు.
పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అందులో భాగంగా ‘పీఎం సూర్య ఘర్’, ‘పీఎం-కుసుమ్’ పథకాల అమలును వేగవంతం చేయాలని సీఎస్ దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు లక్ష్యం కాగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 20 లక్షల ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. దరఖాస్తుల పరిశీలన, అనుమతుల మంజూరు ప్రక్రియలో ఎక్కడ జాప్యం జరగకుండా చూడాలని తద్వారా ప్రజలకు విద్యుత్తు ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అదేవిదంగా పీఎం-కుసుమ్ పథకం ద్వారా వ్యవసాయ ఫీడర్ల సౌరీకరణ (సోలరైజేషన్)ను ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సీఎస్ సూచించారు. దీనివల్ల రైతులకు పగటిపూట నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు అందుతుందని, డీజిల్ వినియోగం తగ్గి సాగు వ్యయం తగ్గుతుందని తెలిపారు. ఇదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాల పారదర్శక అమలుకు ఈ డేటా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. నాయక్, ఐఅండ్‌పీఆర్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, సీడీఎంఏ జి. సంపత్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
