
మౌనమేల రామచంద్రా...?
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా జి.రామచందర్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది రోజులు హడావుడి కనిపించినా ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలు చప్పబడిపోయాయి. ముఖ్యంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ ఆ స్థాయిలో ఉత్సాహం కనిపించడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే వ్యూహ రచనలు, ప్రచార కార్యక్రమాలు ప్రారంభించినా బీజేపీ మాత్రం వెనుకబడిపోయింది. బీజేపీలో ఎందుకు ఈ స్తబ్ధత అనే చర్చ జరుగుతోంది.
అంతర్గత విభేదాలు
రామచందర్ రావు తెలంగాణ బీజేపీ అద్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో సమష్టి నాయకత్వం కొరవడింది. సీనియర్ నాయకుల మధ్య సమన్వయం లోపించడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. కొంతమంది సీనియర్ నాయకులు సహకరించకపోవడం కూడా పార్టీ పురోగతికి అడ్డంకిగా మారింది. మరో వైపు రాజాసింగ్ కూడా బీజేపీకి తలనొప్పిగా మారారు. పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ ఏదో సందర్భంలో తెలంగాణ బీజేపీకి చరుకలంటిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్దామంటూ సవాలు విసిరారు. బీజేపీ తనకు ఎలాంటి సహకారాలు అందించలేదని, పార్టీలో తాను ఎలాంటి పదవి ఆశించలేదని స్పష్టం చేశారు.
ఇప్పుడున్న కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని బహిరంగంగా చెప్పారు. దీంతో బీజేపీ సీనియర్ నాయకులకు ఏం చేయాలో తోచడం లేదు. ఈ కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. పార్టీని నాశనం చేస్తున్నదెవరో మరోసారి చెబుతానంటూ బీజేపీ రాష్ట్ర అధిష్టానాన్ని టెన్షన్ పెట్టారు. ఢిల్లీ పెద్దలు తనకు తరచూ ఫోన్ చేసి మాట్లాడతారని చెప్పారు. తనకు ఎప్పటి నుంచో కేంద్రంలోని పెద్దల ఆశీర్వాదం ఉందని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. కేంద్ర పెద్లలను కలిసి తెలంగాణ బీజేపీలో జరుగుతున్న వ్యవహారాన్ని చెబుతానని హెచ్చరించారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని, సెక్యులర్ వాదిని కాదని వెల్లడించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరనని చెప్పేశారు. ఢిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని పరోక్షంగా తెలంగాణ బీజేపీ నాయకులకు చురకలు అంటించారు. ఇలా రాజాసింగ్ పలు సందర్బాల్లో తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని దూషిస్తూ వస్తున్నారు. దీంతో స్థానిక నాయకులు, కార్యకర్తల్లోనూ అయోమయం నెలకొంది. ఏం చేయాలో తెలియక స్తబ్ధుగా ఉండిపోతున్నారు. దీంతో పాటు కొంత కాలం క్రితం జరిగిన జోనల్ అధ్యక్షుల ఎన్నికలోనూ విభేదాలు తలెత్తాయి. రాష్ట్ర నాయకుడు ఏకచత్రాదిపత్యంగా తమకు అనుకూలంగా ఉన్నవారినే జోనల్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఇందులో సమన్యాయం పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో బలమైన నాయకులు ఉన్నా వారి పెద్దగా స్పందించడంలేదు. దీంతో ఆ నాయకుల అనుచరులు కూడా నాయకుడి బాటలోనే వెళ్తుండడంతో బీజేపీలో జోష్ పెరగడం లేదు.
ఆర్థిక వనరుల కొరత
పార్టీ కార్యకలాపాలను నిర్వహించడానికి ఆర్థిక వనరులు అవసరం. అయితే రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా నిధులు సమకూర్చేవారు లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహించడం కష్టంగా మారింది. ఇది పార్టీ ఉత్సాహాన్ని దెబ్బతీసింది. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీకి నిధుల లభ్యత తక్కువగా ఉండటం వల్ల ప్రచారానికి అవసరమైన ఖర్చులను భరించలేకపోతోంది.
వ్యూహాత్మక లోపం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందాలంటే బలమైన వ్యూహం అవసరం. కానీ బీజేపీ నాయకత్వం ఒక స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఇంటింటి ప్రచారం, డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒక బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి, ప్రజలను ఆకట్టుకునే ప్రణాళికను రూపొందించడంలో విఫలమైంది.బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దివంగత గోపినాథ్ సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రకటించింది. గోపినాథ్ మరణంతో ఆ లోటును భర్తీ చేయడం కోసం, సానుభూతి పొందేందుకు బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో రోజువారీ సమావేశాలతో కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్థేశం చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంది. ఎలాగైనా ఈ సీటులో విజయం సాధించాలని తాపత్రయపడుతోంది.
ఇందుకోసం బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అన్వేషిస్తోంది. సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుంచి భారతీయ క్రీడా కారుడు మహ్మద్ అజహరుద్దీన్ పోటీచేసి ఓటమి చెందారు. ఇప్పుడు మళ్లీ జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమంటూ ప్రచారం చేశారు. అయితే అజహరుద్దీన్ ను పోటీలో ఉంచితే ఆశించినంత ప్రయోజనం ఉండదని భావించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఒకవేళ అజహరుద్దీన్ కు టికెట్ ఇవ్వకపోతే మైనార్టీలో వ్యతిరేకత వస్తుందని భావించిన అధిష్టానం మెల్లిగా అజారుద్దీన్ ను పోటీ నుంచి తప్పించేందుకుయ ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించింది. ఇంకొ అడుగు ముందుకు వేసి కేబినెట్ లో స్థానం కూడా కల్పిస్తామనే ప్రచారం సాగింది. ఇలా అజారుద్దీన్ కు చెక్ పెట్టిన అధిష్టానం స్థానికంగా బలంగా ఉన్న నాయకుడికే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. స్థానికంగా ఇద్దరు, ముగ్గురు బలమైన నాయకులు ఉండడంతో వీరిలో ఒకరికి ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఒకరికి టికెట్ ఇస్తే ఆశిస్తున్న మరో ఇద్దరు సహకరించరేమోననే చర్చ కూడా వచ్చింది. ఇలా అందరికి సమన్యాయం కల్పించి ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవాలనే ప్రణాళికలను కాంగ్రెస్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఊసేలేదు. కనీసం ప్రచారం కూడా కనిపించడం లేదు.
తగ్గిన ఆదరణ
గతంలో బీజేపీకి తెలంగాణలో ఉన్న ఆదరణ ప్రస్తుతం తగ్గిందనే చెప్పాలి. గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీ హైరేంజ్ లో ఉంది. అప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ 46 సీట్లు గెలిచి సత్తాచాటింది. ఆ తర్వాత బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో అనేక మంది కార్యకర్తలు నిరాశ చెందారు. అప్పుడున్నంత జోష్‌లో కార్యకర్తలు ఇప్పుడు కనిపించడం లేదు. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత కిషన్ రెడ్డి తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా, ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సమయం ఇవ్వలేకపోయారు. ఎక్కువగా కేంద్ర కార్యక్రమాల్లో ఉండడంతో తెలంగాణలో బీజేపీ ఎటువంటి సమావేశాలు చేయలేకపోయింది. ఇక ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల్లో రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తలో రామచందర్ రావు ఊపుపై కనిపించినా రాను రాను ఆయనలోనూ ఆ జోష్ తగ్గినట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం, పార్టీ ప్రజల సమస్యలపై నిలకడగా పోరాడకపోవడం వంటివి ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి.
కొరవడిన కేంద్ర మద్దతు
తెలంగాణ బీజేపీకి కేంద్ర నాయకత్వం నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. కీలక నిర్ణయాల విషయంలోనూ, ఆర్థికపరమైన అంశాల విషయంలోనూ కేంద్ర నాయకత్వం నుండి సరైన సహకారం అందడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్ర పార్టీ నాయకులు నిరాశకు గురవుతున్నారు. మరో వైపు పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మీడియా ప్రచారం చాలా ముఖ్యం. కానీ బీజేపీ మీడియా విభాగం అంత చురుగ్గా పని చేయడం లేదు. ఇతర పార్టీలు సోషల్ మీడియాను, ప్రధాన మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుండగా బీజేపీ ఇందులో వెనుకబడిపోయింది.ఇలా అనేక కారణాలు తెలంగాణలో బీజేపీ స్తబ్దుగా మారడానికి దోహదపడ్డాయి. రామచందర్ రావు నేతృత్వంలోని పార్టీ నాయకత్వం ఈ సమస్యలను పరిష్కరించి అంతర్గత విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా ముందుకు సాగితేనే పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. లేకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే కాకుండా, భవిష్యత్తులోనూ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
