Let's talk: editor@tmv.in
మేనమామే అసలు హంతకుడు

మేనమామే అసలు హంతకుడు

Panthagani Anusha
18 సెప్టెంబర్, 2025

ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో 2024 ఫిబ్రవరిలో మల్పురా ప్రాంతంలో ఒక నీలిరంగు డ్రమ్లో సగం కాలిపోయిన శవం కనిపించిన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మృతుడు ఎవరు? అతన్ని చంపింది ఎవరు? ఎందుకు అంత క్రూరంగా శరీరాన్ని దహనం చేశారు? అన్న ప్రశ్నలకు పోలీసులకు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సమాధానాలు లభించాయి.

19 ఏళ్ల రాకేష్ అదృశ్యం కేసు విచారణలో మలుపులు తిరిగింది. ఫిబ్రవరి 18, 2024న రాకేష్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసుగ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు, విచారణలో భాగంగా రాకేష్ అదృశ్యమైన రెండురోజుల తరువాత మల్పురా ఔట్స్కర్ట్స్లో పాక్షికంగా కాలిన మృతదేహం దొరికింది. గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో (డిఎన్ఏ) పరీక్షల ద్వారా మృతదేహం రాకేష్దేనని నిర్ధారణ అయ్యింది. ఇక రాకేష్ బైక్ ఘటన స్థలంలో లభించడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది.

ప్రారంభ దర్యాప్తులో ఈ ఘటనను పోలీసులు సాధారణ హత్యగా పరిగణించిన, ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో కేసు కొత్త మలుపు తిరిగింది. సాంకేతిక విశ్లేషణలు, నిరంతర నిఘా సహకారంతో పోలీసులు చివరకు 2025 సెప్టెంబర్ 15న ప్రధాన నిందితుడు దేవీరామ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో అతను తప్పుడు కథలు చెప్పి అధికారులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ, దేవీరామ్ మొబైల్ఫోన్లో దొరికిన ఆడియో రికార్డులు అసలు వాస్తవాలను బహిర్గతం చేశాయి.

పోలీసులు జరిపిన విచారణలో భాగంగా దేవీరామ్ అధికారుల వద్ద విస్తురుపోయే నిజాలను బయట పెట్టాడు. కాగా మేనల్లుడు రాకేష్, తన 16 ఏళ్ల కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీశాడని, వీడియోని ఆధారంగా చేసుకొని తన కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడని తెలిపాడు. ఈ అవమానం తట్టుకోలేక, మరో మేనల్లుడు నిత్యానంద్తో కలిసి రాకేష్ను హతమార్చేందుకు కుట్ర పన్నినట్టు అధికారుల ముందు ఒప్పుకున్నాడు.

అయితే ప్రణాళిక ప్రకారం రాకేష్ను పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు రావాలంటూ దేవీరమ్ తన దుకాణానికి పిలిపించారు. అనంతరం షాపులో ఉన్న వైర్, మఫ్లర్తో గొంతు కోసి హత్య చేసి, డ్రమ్లో మృతదేహాన్ని వేసి వాహనంలో ఊరిచివర ఉన్న నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇక పక్కనే ఉన్న సయ్యా నదిలో ఫోన్లు, వైర్, మఫ్లర్ను విసిరేసాడు. హత్య అనంతరం దేవీరమ్ తన దుకాణం మూసివేసి తన కుటుంబంతో సహా ఢిల్లీకి పరారయ్యాడు. దీంతో 20 నెలలుగా మిస్టరీగా మిగిలిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ప్రస్తుతం దేవీరామ్ జైలులో ఉండగా, మరో నిందితుడు నిత్యానంద్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

మరోవైపు కేసు దర్యాప్తు ఉన్నతాధికారి మాట్లాడుతూ ఏంతటి నేరస్థుడైన పోలీసుల చెరనుండి తప్పించుకోలేడని, ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిన చిట్టచివరకు చట్టం ముందు లొంగిపోవాల్సిందనని స్పష్టం చేశారు.

మేనమామే అసలు హంతకుడు - Tholi Paluku