

‘మనది పాక్‌లా దళారీ దేశం కాదు’: కేంద్రం
పశ్చిమాసియా యుద్ధం త్వరగా ముగియాలని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తెలియజేశారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ యుద్ధం అందరికీ నష్టాన్ని కలిగిస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారని పేర్కొంది. పశ్చిమాసియా సంక్షోభంపై బుధవారం పార్లమెంట్ భవనంలో జరిగిన అన్ని పార్టీలతో నిర్వహించిన సమావేశంలో, పాకిస్థాన్ పాత్రపై స్పందిస్తూ ‘మనది పాక్‌లా దళారీ దేశం కాదు’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అమెరికా 1981 నుంచే పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా ఉపయోగిస్తోందని ఆయన చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షం చేసిన ‘భారత్ మౌనం పాటిస్తోంది’ అనే ఆరోపణలను కేంద్రం ఖండిస్తూ మనం నిరంతరం స్పందిస్తున్నామని తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ మరణంపై భారత్ ఆలస్యంగా సంతాపం తెలిపిందన్న విమర్శల నేపథ్యంలో, ఇరాన్ ఎంబసీ ప్రారంభమైన వెంటనే విదేశాంగ కార్యదర్శి వెళ్లి సంతాప పుస్తకంలో సంతకం చేశారని వివరించింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రత, దేశీయ ఇంధన అవసరాలు తమకు అత్యంత ప్రాధాన్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంలో ఇప్పటివరకు విజయవంతంగా వ్యవహరించామని తెలిపింది.
తగినంత చమురు నిల్వలు ఉన్నాయి
సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు కూడా పాల్గొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సమగ్ర నివేదిక సమర్పించారు. సమావేశంలో దేశానికి తగినంత చమురు నిల్వలు ఉన్నాయని, అదనంగా చమురు, వాయువు సరఫరా కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ముందస్తు ఆర్డర్లు ఇచ్చామని, 41 దేశాల నుంచి చమురు, వాయువు దిగుమతులు చేస్తున్నామని వెల్లడించింది. హోర్ముజ్ ద్వారా భారతదేశానికి వస్తున్న నాలుగు నౌకలు సురక్షితంగా దాటాయని, మరో ఐదు త్వరలో దాటనున్నాయని తెలిపింది. ప్రస్తుతం 18 నౌకలు అక్కడే నిలిచిపోయినట్లు వెల్లడించింది. అమెరికా దాడిలో మునిగిపోయిన ఇరాన్ నౌకపై స్పందిస్తూ, అది భారత జలాల్లో జరిగి ఉంటే తప్పకుండా రక్షించేవాళ్లమని, కానీ అది శ్రీలంక సమీపంలో జరగడం దురదృష్టకరమని తెలిపింది. ఇతర నౌకలు, నావికులను రక్షించినందుకు ఇరాన్ నుంచి కృతజ్ఞతాభావం వ్యక్తమవుతోందని పేర్కొంది. భారత్ అన్ని దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, ఇజ్రాయెల్ సాంకేతిక భాగస్వామి, ఇరాన్‌తో కూడా మంచి సంబంధాలున్నాయని తెలిపింది. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, టీఎంసీ సభ్యులు ఈ సమావేశానికి గైర్హాజరు కావడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించారు. ఇది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమేనని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నాయని, ఆయన భారత్ వైపు ఉన్నారా లేక పాకిస్థాన్ వైపా అన్నది స్పష్టం చేయాలని జోషి వ్యాఖ్యానించారు.
సమావేశంలో ప్రధానంగా జైశంకర్ ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో అమిత్ షా కూడా స్పందించారు. మీడియాతో మాట్లాడిన కిరెన్ రిజిజు, ప్రధాని సూచన మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షం అడిగిన అన్ని ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇచ్చామని చెప్పారు. చివరికి, సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇస్తామని ప్రతిపక్షం తెలిపిందని పేర్కొన్నారు.
సమావేశం సంతృప్తికరంగా లేదు
అయితే, తారిక్ అన్వర్ మాత్రం సమావేశం సంతృప్తికరంగా లేదని అన్నారు. కేవలం మాటలతో యుద్ధం ఆగదని, వాస్తవ పరిస్థితులపై చర్చ అవసరమని తెలిపారు.
సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ‘సంతృప్తికరంగా లేవు’ అని ప్రతిపక్షం విమర్శించింది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేత తారిక్ అన్వర్ మాట్లాడుతూ పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుండగా, భారత్ మాత్రం మౌనంగా చూస్తోందని విమర్శించారు. ఈ అంశంపై లోక్‌సభలో రూల్ 193, రాజ్యసభలో రూల్ 176 కింద చర్చ జరపాలని కోరారు. సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ, అమెరికా ఇరాన్‌పై చేసిన దాడిపై భారత్ స్పష్టమైన వైఖరి తీసుకోవాలని ప్రతిపక్షం కోరిందన్నారు. పాకిస్థాన్ చురుకైన పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తామని తెలిపారు.
