
మధ్య ప్రాచ్యం నుంచి అమెరికా సైన్యాల ఉపసంహరణ
ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా మధ్య ప్రాచ్యంలోని పలు సైనిక స్థావరాల నుంచి తన సిబ్బందిని వ్యూహాత్మకంగా తరలించడం ప్రారంభించింది. ఈ మార్పులు ఏ లక్ష్యంతో చేపట్టాయో అధికారికంగా వెల్లడించలేదు. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, కతార్‌లోని అల్ ఉడైద్ ఎయిర్‌బేస్ నుంచి వందలాది అమెరికన్ సైనికులను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు పెంటాగన్ వర్గాలు తెలిపాయి. ఇదే తరహా కదలికలు బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, అలాగే ఇరాక్, సిరియా, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని స్థావరాల్లోనూ చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో 30,000 నుంచి 40,000 వరకు అమెరికా సైనికులు ఉన్నారు. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే, వీరే ప్రధాన లక్ష్యాలుగా మారవచ్చని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ది జెరూసలెం పొస్ట్ తెలిపిన వివరాల ప్రకారం, ఇరాన్ ఐక్యరాజ్యసమితి మిషన్ ఒక హెచ్చరిక జారీ చేస్తూ, అమెరికా దాడి చేస్తే ప్రాంతంలోని అన్ని అమెరికా స్థావరాలు, సదుపాయాలు, ఆస్తులు చట్టబద్ధ లక్ష్యాలుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
రక్షణ బలోపేతం
ఈ బెదిరింపుల నేపథ్యంలో మధ్యప్రాచ్యానికి అమెరికా అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, ఇరాన్ భూభాగానికి దూరంగా రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను ఉంచి ప్రతిదాడుల నుంచి రక్షించుకునే చర్యలు చేపడుతోంది. ఈ చర్యలు దీర్ఘకాలిక ఘర్షణకు సిద్ధమవుతున్న సంకేతాలుగా భావిస్తున్నారు. అయితే ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అధికారికంగా దౌత్య పరిష్కారానికే కట్టుబడి ఉన్నామని చెబుతోంది. కానీ టెహ్రాన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలు సరిపోవని భావన వాషింగ్టన్‌లో పెరుగుతోందని వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇరాన్ పాలనా వ్యవస్థ మార్పు (రెజీమ్ చేంజ్) ఆలోచనను కూడా ట్రంప్ ప్రస్తావించడంతో, అంతర్గత సైనిక ప్రణాళికలు మరింత విస్తరించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తంగా మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక కదలికలు ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తత దిశగా సాగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.
