Let's talk: editor@tmv.in
మధ్యాహ్న భోజనం -మార్గమా, గమ్యమా

మధ్యాహ్న భోజనం -మార్గమా, గమ్యమా

Dr.Chokka Lingam
23 మార్చి, 2026

ఇటీవల ప్రముఖ వక్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకం గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలు అహంకారంగా, సున్నితత్వం లేని విధంగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల గురించి మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలపై మాత్రమే ఆధారపడుతున్నారు. అలాంటి పిల్లల గౌరవాన్ని దెబ్బతీసేలా అనిపించే వ్యాఖ్యలు సహజంగానే సమాజంలో ప్రతిస్పందనకు దారితీస్తాయి. ప్రజల ముందు మాట్లాడే వ్యక్తులు తమ మాటల ప్రభావాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే ఈ వివాదం కేవలం ఒక వ్యక్తి వ్యాఖ్యల వరకే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఈ సందర్భం మన విద్యా వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద ప్రశ్నను కూడా మన ముందుకు తీసుకొస్తోంది. మధ్యాహ్న భోజన పథకం మొదట ప్రారంభించబడినప్పుడు దాని ఉద్దేశం స్పష్టంగా ఉండేది. పేద కుటుంబాల పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు వారిని పాఠశాలలకు ఆకర్షించడం, చదువుకు అనుసంధానించడం. అంటే ఇది విద్య అనే లక్ష్యానికి చేరుకోవడానికి ఒక సాధనం మాత్రమే. కానీ కాలక్రమేణా కొన్ని ప్రాంతాల్లో ఈ సాధనం స్వయంగా లక్ష్యంగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.

ఇప్పుడు విద్య గురించి మాట్లాడినప్పుడు మనం ఎక్కువగా చెప్పేది సంఖ్యల గురించే. ఎన్ని పాఠశాలలు నిర్మించాం, ఎందరు ఉపాధ్యాయులను నియమించాం, ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాం, ఎంత మంది విద్యార్థులు నమోదు అయ్యారు – ఈ గణాంకాలనే ఎక్కువగా ప్రస్తావిస్తాం. కానీ విద్య అనే ప్రక్రియ మరింత లోతైనది, అది కేవలం సంఖ్యలతో కొలవలేనిది. విద్య అంటే పాఠ్యాంశాలను కేవలం పఠించడం మాత్రమే కాదు. అర్థం చేసుకోవడం, ప్రశ్నించడం, ఆలోచించడం, మాట్లాడటం, సమాజాన్ని గ్రహించడం వంటి అనేక సున్నితమైన అంశాలు ఇందులో భాగమవుతాయి. ఇవే ఒక విద్యార్థిని నిజమైన పౌరుడిగా తీర్చిదిద్దే మూలాలు.

దురదృష్టవశాత్తు ఈ కీలక అంశాల్లోనే మన విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం వెలువడే ASER (Annual Status of Education Report) నివేదికలు దేశవ్యాప్తంగా విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యంపై ఆందోళనకరమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి స్థాయి పాఠ్యాన్ని కూడా సరిగా చదవలేకపోతున్నారని, సాధారణ గణిత సమస్యలను పరిష్కరించడంలో కూడా ఇబ్బంది పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. పై తరగతులకు చేరుకున్న తర్వాత కూడా పరిస్థితి పెద్దగా మారడం లేదని పరిశీలనలు తెలియజేస్తున్నాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో కూడా చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడం, తమ మాటల్లో చెప్పడం, తర్కబద్ధంగా ఆలోచించడం వంటి నైపుణ్యాలు చాలా చోట్ల బలహీనంగానే ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఇది విద్యార్థుల తప్పు కాదు. వ్యవస్థలోని లోపాల ప్రతిబింబమే. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయం, శక్తి ఎక్కువగా బోధనపై కాకుండా పరిపాలనా పనులపై వెచ్చించాల్సి వస్తోందని చాలా మంది ఉపాధ్యాయులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం వంటి పెద్ద కార్యక్రమాన్ని అమలు చేయడం సులభమైన పని కాదు. ధాన్యాల సరఫరా, నిల్వ, వంట ఏర్పాట్లు, గుడ్లు పంపిణీ, రికార్డులు నిర్వహించడం, పర్యవేక్షణ – ఇవన్నీ సమయం తీసుకునే పనులే. ఈ పనులు అవసరం లేనివి కావు. కానీ అవి బోధన సమయాన్ని మింగేస్తే సమస్య అక్కడే మొదలవుతుంది.

చాలా సందర్భాల్లో అధికారుల పాఠశాల సందర్శనలు కూడా ఇదే పరిస్థితిని ప్రతిబింబిస్తాయి. ఒక జిల్లా కలెక్టర్ పాఠశాలకు వెళ్లినప్పుడు ప్రధానంగా పరిశీలించేది మధ్యాహ్న భోజనమే అవుతున్నది. భోజనం నాణ్యత, వంటగది పరిస్థితి, గుడ్ల పంపిణీ వంటి అంశాలు ముఖ్యమే. కానీ అదే సమయంలో విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి వారి చదువు స్థాయి గురించి తెలుసుకోవడమూ అంతే ముఖ్యమైనది. ఒక అధికారి విద్యార్థులతో ఐదు నిమిషాలు మాట్లాడినా వారి అవగాహన, ఆలోచనా విధానం, భాషా నైపుణ్యాల గురించి స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. అప్పుడు అసలు సమస్య ఎక్కడ ఉందో కూడా అర్థమవుతుంది.

ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఉన్నత పరిపాలనా బాధ్యతలు నిర్వహించే ఐఏఎస్ అధికారుల సమయం ప్రధానంగా వంట నాణ్యత తనిఖీ చేయడానికే వినియోగించాలా? లేక విద్యా విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి, ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడానికి, విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడానికి వినియోగించాలా? ఒక పాఠశాల సందర్శన విద్యార్థుల ఆలోచనలను ప్రేరేపించేలా ఉంటే దాని ప్రభావం చాలా దూరం వరకు ఉంటుంది.

ఇక మధ్యాహ్న భోజన పథకం గురించి మాట్లాడేటప్పుడు మరో విషయం గుర్తుంచుకోవాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల పోషకాహార కార్యక్రమాల్లో ఒకటి. దేశవ్యాప్తంగా లక్షలాది పాఠశాలల్లో ప్రతిరోజూ కోట్లాది భోజనాలు తయారవుతున్నాయి. ఇంత పెద్ద వ్యవస్థలో అప్పుడప్పుడు లోపాలు కనిపించడం సహజం. ఒక చోట వంట సరిగా కాకపోవచ్చు, మరో చోట సరఫరాలో సమస్య రావచ్చు. అలాంటి సంఘటనలను మొత్తం పథకాన్ని తప్పుబట్టడానికి ఉపయోగించడం సరైంది కాదు. మన ఇళ్లలో కూడా ప్రతిరోజూ వంట జరుగుతుంది. నెలలో ఒకసారి వంట బాగాలేకపోవచ్చు. అందుకే మన కుటుంబ వ్యవస్థను ప్రశ్నించము. అదే విధంగా పెద్ద పథకాల్లో చిన్న లోపాలను సందర్భానుసారంగా సరిదిద్దుకోవాలి.

అయితే చరిత్ర మనకు చెప్పే ఒక చిన్న పాఠం కూడా ఉంది. రాజరిక కాలంలో రాజులు పేదలకు కొంత అన్నమో ,గంజో దానం చేసేవారు. దాని వెనుక ఒక రాజకీయ ఉద్దేశం ఉండేది – ప్రజలు పెద్ద ఆలోచనలు చేయకుండా వుండటం,ప్రశ్నలు అడగకుండా. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు అలాంటివి కావు. కానీ సంక్షేమ పథకాలు సమాజంలో ఉన్న పెద్ద సమస్యలను మర్చిపోయేలా చేస్తోంది పాఠశాలల్లో భోజనం ఇవ్వడం అవసరం. కానీ అదే సమయంలో విద్యా నాణ్యత గురించి సమాజం ప్రశ్నలు అడగడం కూడా అవసరం.

భారతదేశంలో విద్యా మౌలిక సదుపాయాలు గతం కంటే ఇప్పుడెంతో విస్తరించింది. ఎక్కువ మంది పిల్లలు పాఠశాలల్లో చేరుతున్నారు. కానీ నిజమైన సవాలు ఇప్పుడు నాణ్యత. చదివినది అర్థం చేసుకునే సామర్థ్యం, స్వతంత్రంగా ఆలోచించే శక్తి, సరళంగా మాట్లాడే ధైర్యం, సమస్యలను విశ్లేషించే నైపుణ్యం – ఇవే విద్య యొక్క అసలు లక్షణాలు. ఇవి లేకపోతే విద్య కేవలం పాఠ్యపుస్తకాల పఠనంగా మాత్రమే మిగిలిపోతుంది.

అందువల్ల ఈ వివాదాన్ని వ్యక్తుల మీదే కేంద్రీకరించడం కన్నా విద్యా వ్యవస్థపై విస్తృత చర్చకు దారితీయాలి. మధ్యాహ్న భోజన పథకం కొనసాగాలి. అది పేద పిల్లల పోషణకు, పాఠశాల హాజరుకు ఎంతో తోడ్పడింది. కానీ అది విద్యా వ్యవస్థలో కేంద్రబిందువుగా మారకూడదు. పాఠశాలల ప్రధాన లక్ష్యం ఎప్పటికీ బోధన మరియు అభ్యాసమే కావాలి.

చివరికి ఒక సాధారణ సత్యం గుర్తుంచుకోవాలి. పాఠశాలలో ఇచ్చే భోజనం అవసరం. అది పిల్లల ఆరోగ్యానికి సహాయపడుతుంది. కానీ అది విద్యా ప్రయాణంలో ఒక సహాయక సాధనం మాత్రమే. నిజమైన గమ్యం మాత్రం విద్యే.

మధ్యాహ్న భోజనం మార్గం - గమ్యం విద్య కావాలి.