Let's talk: editor@tmv.in
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు: రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు వాయిదా!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు: రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు వాయిదా!

Shaik Mohammad Shaffee
6 మార్చి, 2026

నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన త్రైపాక్షిక చర్చలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యాతో జరగాల్సిన తదుపరి రౌండ్ చర్చలను 'కొంతకాలం' వాయిదా వేయాలని, చర్చల వేదికను మార్చాలని అమెరికాతో చర్చించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ గురువారం వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

మారనున్న వేదిక.. టర్కీ లేదా స్విట్జర్లాండ్‌పై మొగ్గు

నిజానికి, ఈ కీలక చర్చలు గల్ఫ్ దేశమైన యూఏఈలోని అబుదాబిలో జరగాల్సి ఉంది. అయితే ఇటీవల అబుదాబిపై ఇరాన్ క్షిపణి దాడులు జరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా వేదికను మార్చాలని ఉక్రెయిన్ భావిస్తోంది. "మార్చి 5 నుంచి 9 మధ్య ఈ త్రైపాక్షిక సమావేశం జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చర్చల వేదికను మార్చాలని ఈ సమావేశానికి ఆహ్వానించిన అమెరికా పక్షంతో చర్చించాం" అని జెలెన్‌స్కీ 'ఎక్స్' వేదికగా తెలిపారు. అబుదాబికి బదులుగా టర్కీ లేదా స్విట్జర్లాండ్‌లో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

డోనెట్స్క్ నుంచి వైదొలగే ప్రసక్తే లేదు

శాంతి చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారిన రష్యా డిమాండ్లపై జెలెన్‌స్కీ మరోసారి నిప్పులు చెరిగారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్ ప్రాంతంలో మిగిలి ఉన్న 20 శాతం భూభాగం నుంచి ఉక్రెయిన్ సైన్యం తప్పుకోవాలన్న పుతిన్ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. "మా ఆధీనంలో ఉన్న మా సొంత భూమిని మేమెందుకు వదలాలి? యుద్ధభూమిలో పుతిన్ ఏమీ సాధించలేకపోయారు. ఆయనకు బలం లేదు. అందుకే మేము ఖాళీ చేయాలని ఆయన నమ్ముతున్నారు. బాగా పటిష్టంగా ఉన్న మా భూభాగాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు" అని జెలెన్‌స్కీ ధీమా వ్యక్తం చేశారు.

యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ జోరు

ఒకవైపు చర్చల ఊహాగానాలు వినిపిస్తున్నా, యుద్ధభూమిలో ఉక్రెయిన్ సైన్యం పట్టు సాధిస్తోంది. రష్యా సైన్యం కంటే తక్కువ ఆయుధ సంపత్తి ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నెలలో ఉక్రెయిన్ గణనీయమైన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. 2023 తర్వాత రష్యా చేతుల్లో కోల్పోయిన దానికంటే ఎక్కువ భూభాగాన్ని తిరిగి పొందడం ఇదే మొదటిసారి అని ఫిన్లాండ్‌కు చెందిన 'బ్లాక్ బర్డ్ గ్రూప్' విశ్లేషణ సంస్థ వెల్లడించింది. కాగా, గత సమావేశాల్లో అంగీకరించిన యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని ఉక్రెయిన్ ఆశాభావం వ్యక్తం చేసింది.