
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న తెలంగాణ పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆయా దేశాల్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు, సమాచారాన్ని అందించేందుకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల పాటు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉన్న సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తాజా పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొంటున్న పరిస్థితులపై అక్కడ ఉన్న తెలంగాణ పౌరులు, అలాగే రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యుల నుంచి అనేక విచారణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి తక్షణ సమాచారం, సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అవసరమైన సమన్వయం, మార్గదర్శకత్వం, అత్యవసర సహాయం అందించబడుతుంది.
ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం నివసిస్తున్న తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, వీసా సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఈ కంట్రోల్ రూమ్‌ను నేరుగా సంప్రదించవచ్చు. వచ్చిన సమాచారాన్ని వెంటనే సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలకు, విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేసి అవసరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేస్తుంది.
మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం గమనిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. 24×7 కంట్రోల్ రూమ్ తెలంగాణ భవన్, న్యూ ఢిల్లీ.. సంప్రదింపు నంబర్లు: వందన బరువా (పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్): +91 9871999044, సి.హెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) +91 9958322143, జావేద్ హుస్సేన్ (లైజన్ ఆఫీసర్) 9910014749, రక్షిత్ నాయక్ (లైజన్ ఆఫీసర్), +91 9643723157. పరిస్థితులు మారుతున్న కొద్దీ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
