Let's talk: editor@tmv.in
మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై కమల్ నాథ్ విమర్శలు

మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై కమల్ నాథ్ విమర్శలు

Pinjari Chand
13 అక్టోబర్, 2025

చింద్వారాలో కొల్డ్రిఫ్ దగ్గు మందు వల్ల సుమారు 22 మంది చిన్నారులు ఇటీవల మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు. చిన్నారులు చనిపోవడం చాలా బాధకరమైందని తీవ్ర ఆవేదన చెందారు. ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔషదాలను పరీక్షించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇంకా చాలా గుర్తు తెలియని ఔషదాలు ఉన్నాయని, వాటిని కూడా పరీక్షించలేదని ఆరోపించారు. నేను సీఎంతో మాట్లాడాను.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాను. వారు స్పందించకపోతే నేను చేయాల్సిన పని చేస్తానని హెచ్చరించారు.

చిన్నారుల మృతి ఘటనలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ డిమాండ్ చేశారు.ఆయనకు సిరప్ కంపెనీతో సంబంధాలున్నాయని ఆరోపించారు.అలాగే సిరప్ కంపెనీ యజమాని నెలలోనే 150 కిపైగా మందు బాటిళ్లను అమ్మారని వారిపై కఠినచర్యలు తీసుకోవాలని,22 మంది చిన్నారుల మరణానికి కారణమైన అతనికి మరణశిక్ష విధించాలన్నారు. బీజేపీ మతాల మధ్య గొడవలు పెడుతుందని, కానీ చిన్నారుల మరణాలకు కారణమైన కంపెనీ యజమానికి, ఆరోగ్యశాఖ మంత్రికి క్లీన్ చిట్ ఇచ్చిందని ఆరోపించారు. ఈ సందర్భంలో చింద్వారా ఎస్పీ అజయ్ పాండే మాట్లాడుతూ శ్రీసన్ ఫార్మా యజమాని రంగనాథన్ ను చింద్వారా ఫారాసియా కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీకి పంపిందని తెలిపారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై కమల్ నాథ్ విమర్శలు - Tholi Paluku