Let's talk: editor@tmv.in
మధ్యప్రదేశ్‌లో 42 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు

మధ్యప్రదేశ్‌లో 42 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు

Pinjari Chand
24 డిసెంబర్, 2025

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ మధ్యప్రదేశ్‌లో పూర్తైన నేపథ్యంలో, భారత ఎన్నికల కమిషన్ మంగళవారం తొలి ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో 42,74,160 ఓటర్ల పేర్లు తొలగించినట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రామ్ ప్రతాప్ సింగ్ జడోన్ తెలిపిన వివరాల ప్రకారం, 2025 అక్టోబర్ 27 నాటికి 5,74,06,143 ఓటర్ల సంఖ్య ఉంది. డిసెంబర్ 23 నాటికి 5,31,31,983కి తగ్గింది.

తొలగించిన ఓటర్ల విభజన:

8,46,184 మంది – మరణించిన ఓటర్లు

8,42,677 మంది – నివాస స్థలంలో లేని ఓటర్లు

22,78,393 మంది – ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు

2,76,961 మంది – ద్వంద్వ నమోదు (డూప్లికేట్) ఓటర్లు

29,927 మంది – ఇతర కారణాలు

ఇదేకాకుండా, సుమారు 8.65 లక్షల ‘అన్‌మ్యాప్‌డ్’ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీరి పేర్లు ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్నప్పటికీ, 2003 నాటి రికార్డుల్లో వీరి సమాచారం లభించలేదు.

నోటీసులు – పత్రాల పరిశీలన

ఈ డేటా రికార్డులలో సరిపోలని (అన్‌మ్యాప్‌డ్) ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. వారు తమకు సంబంధించిన పత్రాలను ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో) లేదా సహాయక ఈఆర్వో ముందు సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాలో పేరు చేర్చడం లేదా సవరణల కోసం జనవరి 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 21న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.

ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్

ఎస్ఐఆర్ ప్రక్రియ తొలి దశను బీహార్‌లో అక్కడి అసెంబ్లీ ఎన్నికల ముందు సెప్టెంబర్‌లో నిర్వహించారు. ఈ పక్రియ ఇప్పుడు అండమాన్–నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా మొత్తం మధ్యప్రదేశ్‌తో కలిపి 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. అధికారుల శిక్షణ, ముద్రణ పనులు: అక్టోబర్ 28 – నవంబర్ 3, ఎన్యూమరేషన్ దశ: నవంబర్ 4 – డిసెంబర్ 4 మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరిగే అవకాశం ఉంది.