Let's talk: editor@tmv.in
మధ్యప్రదేశ్‌లో బాలల అక్రమ రవాణ భగ్నం.. 163 మంది బాలల రక్షణ

మధ్యప్రదేశ్‌లో బాలల అక్రమ రవాణ భగ్నం.. 163 మంది బాలల రక్షణ

Pinjari Chand
13 ఏప్రిల్, 2026

బీహార్‌ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 163 మంది బాలురను మధ్యప్రదేశ్‌లోని కట్నీ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో బాలలను తీసుకెళ్తున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరు నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు గల ఈ చిన్నారులను బీహార్‌లోని అరారియా ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని లాతూర్‌కు కూలీ పనుల కోసం తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి పాట్నా–పూర్ణ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వీరిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రైల్వే ప్రోటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్) గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ) సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. కట్నీ రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపి తనిఖీలు నిర్వహించి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

రైలులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది వ్యక్తుల వద్ద సరైన టికెట్లు, పత్రాలు లేకపోవడంతో వారిపై అనుమానం వ్యక్తమై ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఎనిమిది మంది నిందితులపై బీఎన్‌ఎస్‌లోని బాలల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్‌ 143(4) కింద కేసు నమోదు చేశారు. ఈ నిందితులు బీహార్‌లోని వివిధ జిల్లాలకు చెందిన వారని అధికారులు చెప్పారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అనుమానాస్పదంగా పెద్ద సంఖ్యలో చిన్నారులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు స్టేషన్‌కు చేరుకున్న వెంటనే కోచ్‌లను తనిఖీ చేసి చిన్నారులను రక్షించారు.

రక్షించిన పిల్లలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు బాలల సంరక్షణ అధికారి తెలిపారు. వారి తల్లిదండ్రులను సంప్రదించేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. పిల్లల వయస్సు, గుర్తింపు, ఎందుకోసం వారు వెళుతున్నారనే దానిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రక్షించిన చిన్నారుల్లో కొందరిని కట్నీ, మరికొందరిని జబల్‌పూర్‌లోని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు.

మధ్యప్రదేశ్‌లో బాలల అక్రమ రవాణ భగ్నం.. 163 మంది బాలల రక్షణ - Tholi Paluku