Let's talk: editor@tmv.in
మధ్యప్రదేశ్‌లో దళితుడి ఇంట్లో భోజనం చేశాడని గ్రామ బహిష్కరణ

మధ్యప్రదేశ్‌లో దళితుడి ఇంట్లో భోజనం చేశాడని గ్రామ బహిష్కరణ

Pinjari Chand
11 డిసెంబర్, 2025

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయ్‌సేన్ జిల్లాలో ఓ వ్యక్తి అంత్యక్రియల అనంతరం దళితుడి ఇంట భోజనం చేశాడనే కారణంతో గ్రామ పంచాయతీ తన కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి జన్ సున్ వాయిలో ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉదయ్‌పురా పరిధిలోని పిపరియా పురియా గ్రామంలో సుమారు ఒక నెల క్రితం జరిగింది. మంగళవారం జనసున్వాయి (ప్రజల ఫిర్యాదు స్వీకరణ)లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దళితుడి ఇంట భోజనం చేసిన ఉన్నత కులానికి చెందిన ముగ్గురు వ్యక్తులను సామాజికంగా బహిష్కరించాలని పంచాయతీ నిర్ణయించినట్లు ఆరోపణ ఉంది. బహిష్కరణ నుంచి తప్పించుకోవాలంటే గ్రామంలో భోజనాలు పెట్టడం వంటి కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ముగ్గురిలో ఇద్దరు పంచాయతీ షరతులకు ఒప్పుకుని గంగాలో స్నానం చేసి, గ్రామంలో భోజనాలు పెట్టి ప్రక్షాళన చేసుకున్నారు. కానీ మూడో వ్యక్తి భరత్ సింగ్ ధాకడ్ మాత్రం నిరాకరించడంతో తనే తన కుటుంబం మొత్తం సామాజిక బహిష్కరణకు గురవుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సర్పంచ్ భగవాన్ సింగ్ పటేల్ మాత్రం ఈ ఆరోపణలను బూటకమని కొట్టిపారేశారు. ఉదయ్‌పురా తహసీల్దార్ దినేశ్ బర్గలే మాట్లాడుతూ, మంగళవారం జిల్లా కలెక్టర్ వద్ద జరిగిన జనసున్వాయిలో భరత్ సింగ్ ధాకడ్ దరఖాస్తు ఇచ్చారని, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచ్‌లపై ఆరోపణలు చేశారని తెలిపారు. విచారణ జరుగుతోంది. ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

గోహత్య కంటే పాపమన్నారు

భరత్ సింగ్ ధాకడ్ చెప్పిన వివరాల ప్రకారం – తాను, గ్రామ పంచాయతీ సహాయ కార్యదర్శి మనోజ్ పటేల్, ఉపాధ్యాయుడు సత్యేంద్ర సింగ్ రఘువంశీ కలిసి గ్రామంలోని దళితుడు సంతోష్ మెహతార్ ఇంట ‘శ్రాద్ధ కర్మ’లో భోజనం చేశాం. దీంతో ఇది గోహత్య కంటే పెద్ద పాపమని, గంగా స్నానం చేసి, గ్రామంలో భోజనాలు పెట్టి పాప ప్రక్షాళన చేసుకోవాలని పంచాయతీ ఆదేశించింది. అప్పటి నుంచి తన కుటుంబాన్ని అంటరానివారిలా చూస్తున్నారని, ఆలయంలోకి కూడా అడుగుపెట్టనివ్వడం లేదని ధాకడ్ ఆరోపించాడు. తన తండ్రి బతికి ఉండగానే పిండదానం చేయించాలని, తల గొరిగించుకోవాలని కూడా పంచాయతీ చెప్పిందని అన్నాడు. సర్పంచ్ భగవాన్ సింగ్ పటేల్ మాత్రం ఎవరో వ్యక్తిగత కారణాలతో ఆయన్ను కార్యక్రమాలకు పిలవకపోవచ్చు, అది అంటరానితనం కాదని, శాసనసభ్యుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నరేంద్ర శివాజీ పటేల్ కూడా వచ్చి సామరస్యం కోసం మాట్లాడారని, కానీ ప్రజలు వినకపోతే తమ చేతుల్లో ఏమీ లేదని అన్నారు. ఇలాంటి ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్-డివిజనల్ పోలీస్ అధికారి కుంవర్ సింగ్ ముకాటీ స్పష్టం చేశారు. భోజనం చేసిన మరో వ్యక్తి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు సత్యేంద్ర సింగ్ రఘువంశీ మాట్లాడుతూ తనపై ఇప్పుడు బహిష్కరణ లేదని, ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వివాదమైందని, పంచాయతీ చెప్పినట్లు అలహాబాద్ వెళ్లి సంగమంలో స్నానం చేసి వచ్చానని, తనకు ఎవరిపైనా ఫిర్యాదు లేదని అన్నాడు.

మధ్యప్రదేశ్‌లో దళితుడి ఇంట్లో భోజనం చేశాడని గ్రామ బహిష్కరణ - Tholi Paluku