
మధ్యప్రదేశ్‌లో కలుషిత నీరు కలకలం
దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నేటికీ బావినీటినే తాగునీటిగా వాడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల వృద్ధి వైపు పరిగెడుతుందని గర్వంగా చెబుతున్నా ఇప్పటికీ చేతిపంపులు, బోరు బావుల నీరే దిక్కు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది. సామాన్య ప్రజల దుస్థితులు ఎప్పటికి మారతాయి. యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి ఎప్పుడు వీడుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
బావిలోని కలుషిత నీరు తాగి సుమారు 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలోని రజోలా గ్రామంలో కలకలం రేపింది. ఇటీవల చింద్వారా జిల్లాలోనే కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ వాడిన 22 మంది పిల్లలు మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికి ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మరిచిపోకముందే కలుషిత నీరు తాగి ఆసుపత్రుల పాలైన ఘటన షాక్ కు గురి చేసింది. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హేమకరణ్ ధుర్వే మాట్లాడుతూ మేం 150 కుటుంబాలకు సంబంధించిన వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాం. అందులో 60 మంది వాంతులు, విరేచనాల లక్షణాలతో బాధపడుతున్నారు. బావి నీటి నమూనాలు పరీక్షించగా కలుషితంగా ఉన్నట్లు గుర్తించాం. అలాగే బావిలో నాలుగు పావురాలు చనిపోయి ఉండటం గమనించాం. దీంతో వెంటనే బావిని మూసివేశాం. ఈ రోజు శుద్ధి చేసి తాజా నీటితో నింపుతామని చెప్పారు.
ఇప్పటివరకు 120 మందికి మందులు ఇచ్చాం. వచ్చే 2–3 రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహిస్తాం. ఎవరూ ప్రాణపాయ స్థితిలో లేరని, గ్రామపంచాయతీ కార్యాలయంలో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామపంచాయతీ, పంప్ ఆపరేటర్లు, కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎవరికీ ప్రాణపాయ పరిస్థితులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్ల స్పందిస్తూ రాష్ట్రంలో 20 మంది పిల్లలు కఫ్ సిరప్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఔషధ పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది" అన్నారు.
హర్ ఘర్ జల్ పథకం ఏమైంది
ఎన్డీయే 2019లో కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టాక దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని పార్లమెంట్ లో ప్రకటించింది. ఇప్పటి వరకు సుమారు రూ.3 లక్షల కోట్లకు పైగా కేటాయించింది. ఇందులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా నిధులు విడుదల చేసింది.
2019-20: ₹571.60 కోట్లు,
• 2020-21: ₹1,280.13
• 2021-22: ₹5,116.79
• 2022-23: ₹5,641.02
• 2023-24: ₹10,297.86 కోట్లు,
• 2024-25: ₹4,044.70 కోట్లు, మొత్తం మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకూ 06.03.2025 నాటికి ఈ పథకం కింద రూ.26,952.10 కోట్లు కేంద్రం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసింది. అందులో రూ.16,232.04 కోట్లు విడుదల చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఇప్పటికి బావుల పైనే
రజోలా తదితర చుట్టు పక్క గ్రామాల్లో చాలామంది ప్రజలు ఇప్పటికీ బావులు, చేతి పంపులు, బోర్లద్వారా నీటిని ఉపయోగిస్తున్నారు. చింద్వారా జిల్లా పంచాయతీ నివేదికల ప్రకారం కొన్ని గ్రామాల్లో పైపులైన్ వేసినా నీటి సరఫరా ఇంకా ప్రారంభం కాలేదు. పథకంలో భాగంగా ప్రతీ గ్రామానికి వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ ఉండాలి. కానీ రజోలా గ్రామంలో లేకపోవడంతో బావి నీరే అన్నింటికి వాడాల్సి వస్తోంది. హర్ ఘర్ జల్ పథకం ఎంత వేగంగా, ఎంత చిత్తశుద్ధితో జరుగుతందనే దానికి ఈ ఉదంతమే ఉదాహరణగా నిలుస్తోంది.
