
మధ్యప్రదేశ్‌లో కలకలం: కలుషిత నీటితో ఏడుగురు మృతి
2017 నుంచి వరుసగా 2023 వరకు ఏడు సార్లు దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా అవార్డులు అందుకున్న ఇండోర్ లో మృత్యువు కలుషిత రూపంలో ఏడుగురి ప్రాణాలను కబళించింది. కలుషిత తాగునీరు వల్ల ప్రజలు వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురై వారం వ్యవధిలో ఏడుగురు మరణించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
మ ధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో కలుషిత తాగునీటి కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి కైలాష్ విజయవర్గీయ స్పందించారు. ఈ ఘటనలో అధికారుల వైఫల్యం చోటుచేసుకుందని ఆయన అంగీకరిస్తూ, బాధ్యులైన వారిని వారి హోదా ఎంత పెద్దదైనా సరే వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
భగీరథ్‌పురా ప్రాంతంలో కలుషిత నీరు తాగిన తర్వాత అనారోగ్యానికి గురై వారం వ్యవధిలో ఏడుగురు మృతి చెందినట్లు ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ్ ఇప్పటికే ధృవీకరించారు. ఈ ప్రాంతం దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా పేరున్న ఇండోర్‌లో ఉండటం గమనార్హం. వారం రోజులుగా భగీరథ్‌పురాలో వాంతులు, విరేచనాల వ్యాధితో 1,100 మందికిపైగా ఏదో ఒక రూపంలో ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 111 మందిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రాంతం పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండోర్–1 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ ఘటనపై స్పందించిన ఆయన తప్పిదం జరిగిందన్న భావన నాకు ఉంది. అయితే ఇప్పుడే దానిపై చర్చించకుండా, ముందుగా బాధితులు కోలుకునేలా చూసి, సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాలని అన్నారు. మృతుల సంఖ్యపై ప్రశ్నించగా, సహజ మరణాలు కూడా ఉన్నాయని, కలుషిత నీటి ఘటనకు సంబంధించిన మృతుల సంఖ్యపై వైద్యులు, పరిపాలన నిర్వహించే విచారణ అనంతరం అధికారిక వివరాలు వెల్లడిస్తామని విజయవర్గీయ తెలిపారు.
ప్రస్తుతం వాంతులు, విరేచనాల కేసులు కొంత తగ్గినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. భగీరథ్‌పురా ప్రాంతంలో నాలుగు అంబులెన్సులు, ప్రత్యేక వైద్య బృందాలను మోహరించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్వహణలోని మహారాజా యశ్వంత్‌రావ్ ఆసుపత్రి, ప్రైవేట్ శ్రీ ఔరోబిందో మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌లో బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల వైద్య ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ఇండోర్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, భగీరథ్‌పురాలోని ప్రధాన నీటి సరఫరా పైప్‌లైన్‌లో లీక్ గుర్తించాం. ఆ పైప్‌లైన్‌పై ఒక మరుగుదొడ్డి నిర్మించినందున నీరు కలుషితమై ఉండవచ్చని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఒక జోనల్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేయగా, ఒక ఇన్‌చార్జ్ సబ్ ఇంజనీర్‌ను సేవల నుంచి తొలగించారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
రూ. కోటి పరిహారమివ్వాలి: కాంగ్రెస్
ఇండోర్‌లలో కలుషిత నీరు తాగడం వల్ల మరణాలు సంభవించాయన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తత పెరిగింది. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పీసీ శర్మ మాట్లాడుతూ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కలుషిత నీరు తాగడం వల్ల జరిగిన మరణాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం ఇవ్వడంతో పాటు, ప్రతి కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత మనక్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ ఘటనను ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టనివ్వదని, ప్రతి స్థాయిలో పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కలుషిత నీరు సరఫరా విషయంలో వైఫల్యం చెందినందుకు ఇండోర్ మేయర్, మున్సిపల్ కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం:మేయర్
ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ్ మాట్లాడుతూ కలుషిత నీటి కారణంగా ఏడుగురు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ నిర్ధారించిందన్నారు. ఈ ఘటనలో మొత్తం 116 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని, వారిలో 36 మందిని ఇప్పటికే ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఆరోగ్య శాఖ నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి పని చేస్తోందని మేయర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన చికిత్స అందించి వారు త్వరగా కోలుకునేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ దురదృష్టకర ఘటనపై తామంతా తీవ్రంగా విచారిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శిస్తూ చికిత్స అందిస్తున్నారని మేయర్ వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించారని, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు, బాధితులందరికీ ఉచిత వైద్యం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా స్పందించి, మృతులకు నివాళులు అర్పించి, చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
విచారణ కమిటీ నియామకం
ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం, జోనల్ ఆఫీసర్ శాలిగ్రామ్ సిటోలే, అసిస్టెంట్ ఇంజనీర్ యోగేశ్ జోషీలను తక్షణమే సస్పెండ్ చేయగా, ఇన్‌చార్జ్ సబ్-ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్) శుభమ్ శ్రీవాస్తవను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఐఏఎస్ అధికారి నవజీవన్ పాన్‌వార్ నేతృత్వంలో విచారణ చేపట్టనుంది. కమిటీలో సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రదీప్ నిగమ్, మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శైలేశ్ రాయ్ సభ్యులుగా ఉన్నారు. మంగళవారం ఇండోర్‌లో కలుషిత నీరు తాగిన అనంతరం పలువురు అనారోగ్యానికి గురవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
