Let's talk: editor@tmv.in
మధ్యప్రదేశ్‌లో అర్ధరాత్రి ఐఏఎస్ అధికారుల బదిలీలు

మధ్యప్రదేశ్‌లో అర్ధరాత్రి ఐఏఎస్ అధికారుల బదిలీలు

Pinjari Chand
15 ఫిబ్రవరి, 2026

మధ్యప్రదేశ్ ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి జారీ చేసిన ఉత్తర్వులతో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో అవినీతి అధికారులను కాపాడేందుకేఈ మార్పులు చేపట్టారని ఆరోపించింది. సాధారణ పరిపాలన శాఖ తెల్లవారుజామున 1.55 గంటల సమయంలో ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు ప్రధాన కార్యదర్శి అశోక్ బర్న్వాల్‌కు ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు ఆ బాధ్యతలు నిర్వహించిన సందీప్ యాదవ్‌ను అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనకు ఎన్‌ఆర్‌ఐ శాఖ అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి మనీష్ సింగ్‌ను మళ్లీ ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌గా నియమించారు. ఆయన రవాణా శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు. నాలుగు నెలలుగా ప్రజా సంబంధాల కమిషనర్‌గా ఉన్న దీపక్ సక్సేనాను ఎక్సైజ్ కమిషనర్‌గా నియమించారు. ఈ పదవిలో ఉన్న అభిజిత్ అగర్వాల్‌ను రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. కొత్త ఎక్సైజ్ విధానం అమలుకి ముందు ఈ మార్పులు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇతర మార్పులలో భాగంగా రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి డైరెక్టర్ అజయ్ గుప్తాను జబల్‌పూర్ ఈస్ట్ రీజియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. రాజ్ భవన్‌లో ఎనిమిది నెలలపాటు పనిచేసిన ఉమాశంకర్ భార్గవాను మళ్లీ రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి డైరెక్టర్‌గా నియమించారు.

భింద్ జిల్లా పంచాయతీ సీఈఓ సునీల్ దూబేను గవర్నర్ ఉప కార్యదర్శిగా నియమించగా, ఉన్నత విద్యాశాఖ ఉప కార్యదర్శి సంగ్‌మిత్ర గౌతమ్‌ను అలిరాజ్‌పూర్ జిల్లా పంచాయతీ సీఈఓగా నియమించారు. అగర్ మాల్వా జిల్లా పంచాయతీ సీఈఓ నందా భలావే కుష్రేను రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌లో అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు. పాఠశాల విద్యాశాఖ ఉప కార్యదర్శి కమల్ సోలంకీని రైసేన్ జిల్లా పంచాయతీ సీఈఓగా నియమించారు.

ఈ మార్పులపై స్పందించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్, ఎక్సైజ్ శాఖలో అవినీతి ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. ఇండోర్‌లో రూ.75 కోట్ల నకిలీ చలాన్ల వ్యవహారం, జబల్‌పూర్‌లో విషపూరిత మద్యం వల్ల 15 మందికి పైగా మరణాలు జరిగినప్పటికీ బాధ్యులపై చర్యలు లేవని ఆరోపించింది. బదిలీలు జరిగాయి, కానీ బాధ్యత ఎక్కడ? అని పార్టీ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించింది. రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు ముందు జరిగిన ఈ అర్ధరాత్రి బదిలీలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.