Let's talk: editor@tmv.in
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Dantu Vijaya Lakshmi Prasanna
28 మార్చి, 2026

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛింద్వారా జిల్లాలో గురువారం సాయంత్రం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్న ఒక బహిరంగ సభ ముగించుకుని తిరిగి వస్తున్న ప్రయాణీకుల బస్సు, ఎదురుగా వస్తున్న పికప్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ముఖాముఖి సంఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బస్సు మరియు పికప్ వాహనాలు రెండూ నుజ్జునుజ్జయ్యాయి.

జిల్లా కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్‌పూర్ రోడ్డులోని సిమారియా సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అంతకుముందు సాయంత్రం 5:45 గంటలకు ఛింద్వారా నగరంలోని పోలీస్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 506 కోట్ల రూపాయల వ్యయంతో 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే ఈ విషాదం చోటుచేసుకోవడం విషాదాకరం.

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది బస్సులో ప్రయాణిస్తున్న వారు కాగా, మిగిలిన ఇద్దరు పికప్ వాహనం యొక్క డ్రైవర్, క్లీనర్ అని కలెక్టర్ హరేంద్ర నారాయణ్ ధృవీకరించారు.

ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన 31 మందిని వెంటనే అంబులెన్స్‌లు, ఇతర ప్రైవేట్ వాహనాలలో స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఒకరిని పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు జబల్‌పూర్ నుండి ప్రత్యేక వైద్య బృందాలను ఛింద్వారాకు పంపారు.

మరణించిన వారిలో దౌలత్ పరకారా అనే వ్యక్తి కూడా ఉన్నాడని, సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నట్లు అతని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

ఈ దారుణ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని ఇచ్చారు. ఇది అత్యంత హృదయ విదారకమైన సంఘటన అని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యలలో నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే జబల్పూర్ నుంచి వైద్య బృందాలను వెంటనే చింద్వారా నాగ్‌పూర్‌కు పంపించాలని ఆదేశించారు

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం, అలాగే గాయపడిన వారికి ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులందరికీ ప్రభుత్వ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందిస్తామని, చికిత్స విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఛింద్వారా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి రాకేశ్ సింగ్ తన ముందస్తు కార్యక్రమాలను రద్దు చేసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని పర్యవేక్షించేందుకు, వారికి అందుతున్న వైద్య సహాయాన్ని సమీక్షించేందుకు భోపాల్‌లోని ఆరోగ్య శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ అజయ్ పాండే స్వయంగా సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతి వేగమా లేక డ్రైవర్ల అజాగ్రత్తా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ముగిసిన ఆనందంలో ఉన్న కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక ప్రజలు కూడా సహాయక చర్యలలో పాల్గొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చింది.