Let's talk: editor@tmv.in
మధ్యధరా సముద్రంలో విషాదం.. తుపాను ధాటికి పడవలు మునిగి వందలాది మంది గల్లంతు!

మధ్యధరా సముద్రంలో విషాదం.. తుపాను ధాటికి పడవలు మునిగి వందలాది మంది గల్లంతు!

Shaik Mohammad Shaffee
28 జనవరి, 2026

ఐరోపా దేశాలకు వెళ్లాలనే ఆశతో మధ్యధరా సముద్రాన్ని దాటుతున్న వందలాది మంది వలసదారుల జీవితాలు గాలిలో దీపాలుగా మారాయి. గత పది రోజులుగా ఈ ప్రాంతాన్ని వణికిస్తున్న 'హ్యారీ' తుపాను ధాటికి పలు పడవలు మునిగిపోవడంతో వందలాది మంది గల్లంతయ్యారు. వీరంతా మరణించి ఉండవచ్చని ఐరాసకు చెందిన అంతర్జాతీయ వలస సంస్థ (ఐఓఎం) సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

కవల పిల్లలతో సహా ముగ్గురు మృతి

ట్యునీషియాలోని స్ఫాక్స్ నుంచి బయలుదేరిన ఒక పడవ ఇటలీలోని లాంపెడుసా సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు ఏడాది వయసున్న కవల బాలికలతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన గినియాకు చెందిన వారి తల్లి కన్నీరుమున్నీరవుతూ.. తన బిడ్డలు గడ్డకట్టే చలి కారణంగానే కళ్లముందే చనిపోయారని వెల్లడించింది. వీరితో పాటు మరో వ్యక్తి కూడా అదే కారణంతో మృతి చెందాడు. అదే సమయంలో బయలుదేరిన మరో పడవ ఆచూకీ ఇప్పటికీ లభించలేదని ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు.

పరిమితికి మించి పడవల్లో..

సముద్రంలో తీవ్రమైన తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ, వలసదారులను పరిమితికి మించి పడవల్లో ఎక్కించి పంపడంపై ఐరాస తీవ్రంగా మండిపడింది. "సముద్ర ప్రయాణానికి ఏమాత్రం పనికిరాని పడవల్లో మనుషులను పంపడం నేరం. మృత్యువు పొంచి ఉందని తెలిసి కూడా తుపాను సమయంలో వారిని సముద్రంలోకి పంపడం అత్యంత దారుణం" అని ఐఓఎం నిప్పులు చెరిగింది. అక్రమ రవాణా జాలాలను అరికట్టేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని కోరింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మార్గం

మధ్యధరా సముద్రం వలసదారుల పాలిట 'మృత్యు కారిడార్'గా మారుతోంది. ఐరాస గణాంకాల ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గంగా ఇది రికార్డులకు ఎక్కింది. 2014 నుంచి 2025 చివరి వరకు దాదాపు 33,000 మందికి పైగా వలసదారులు మెరుగైన జీవితం కోసం ఈ సముద్రాన్ని దాటే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోవడం లేదా గల్లంతు కావడం గమనార్హం. ఒక్క 2025 సంవత్సరంలోనే కనీసం 1,340 మంది ఈ 'మృత్యు కారిడార్'లో జలసమాధి అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పది రోజుల్లోనే 9 పడవలు గల్లంతు

ప్రస్తుతం సముద్రంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు వలసదారుల ప్రాణాలను తోడేస్తున్నాయి. జనవరి 14 నుంచి 21 మధ్య కాలంలో ట్యునీషియా తీరం నుంచి ఐరోపా వైపు బయలుదేరిన 9 పడవల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వీటిలో సుమారు 380 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, లిబియాలోని టోబ్రుక్ తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో కనీసం 51 మంది మరణించి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ అక్రమ రవాణాదారులు వలసదారులను బలవంతంగా సముద్రంలోకి పంపడమే ఈ వరుస విషాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.