Let's talk: editor@tmv.in
మధుర మీనాక్షి సన్నిధిలో కేంద్ర మంత్రి రామ్ మోహన్

మధుర మీనాక్షి సన్నిధిలో కేంద్ర మంత్రి రామ్ మోహన్

Panthagani Anusha
15 మార్చి, 2026

ఆధ్యాత్మిక నగరం మధురై ప్రజల మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మధురై విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కాగా శనివారం తమిళనాడు పర్యటనకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మధురై మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మధురై ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిందని గత 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను ప్రధాని మోదీ చొరవతో సాధ్యం చేశాం. ఈ సంతోషాన్ని మధురై ప్రజలతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మధురై విమానయాన చరిత్రలో ఇదొక కీలక మలుపు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆలయ దర్శనం గురించి ప్రస్తావిస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మధురై మీనాక్షి ఆలయం నిలువుటద్దమని ఈ ఆలయం దేశానికే గర్వకారణమని కొనియాడారు.

కేంద్ర కేబినెట్ ఆమోదం

మార్చి 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మరోవైపు ఈ నిర్ణయంపై కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ తమిళనాడులోని ప్రధాన నగరాలైన చెన్నై, కోయంబత్తూరుతో సహా మధురై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా దక్షిణ తమిళనాడుకు ప్రవేశ ద్వారంగా ఉన్న మధురై విమానాశ్రయం రాష్ట్రంలోని సుదీర్ఘ చరిత్ర కలిగిన విమానాశ్రయాలలో ఒకటి. తాజాగా లభించిన అంతర్జాతీయ హోదా వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా మీనాక్షి ఆలయ దర్శనానికి వచ్చే విదేశీ పర్యాటకులు, యాత్రికుల సంఖ్య పెరగడంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు.