
మధిర పట్టణంలో నూతన మున్సిపల్ భవనానికి డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టణంలో అధికారికంగా డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఎగరవేశారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దేశ స్వాతంత్య్రం ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా డిప్యూటి సీఎం గుర్తుచేశారు. స్వాతంత్య్రం సమరంలో ముందుండి పోరాడిన కాంగ్రెస్ పార్టీ, అనంతరం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి మౌలిక విలువలను కాపాడుతూ దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగిందని వారు పేర్కొన్నారు. ప్రజల హక్కులు, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని డిప్యూటీ సీఎం అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆదర్శాలతో ప్రజల సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా మధిర పట్టణ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. సుమారు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో మధిర మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ నూతన మున్సిపల్ భవనం ద్వారా ప్రజలకు మెరుగైన పాలనా సౌకర్యాలు, వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు.
పట్టణ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం, పాలనలో పారదర్శకత పెంపొందించడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు. మధిర పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ నూతన మున్సిపల్ భవనం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలవనుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
