
మధిరను రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా: డిప్యూటీ సీఎం భట్టి
రాజకీయాలు మా లక్ష్యం కాదు.. అభివృద్ధే మా ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిరలో పర్యటించిన ఆయన, పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని వెల్లడించారు.
మధిర సమగ్ర అభివృద్ధికి అవసరమైన పలు పనులకు ఇప్పటికే అనుమతులు తీసుకువచ్చామని, అవి నాణ్యతతో ప్రణాళికాబద్ధంగా అమలు కావాలంటే మంచి పాలకవర్గం అవసరమని అన్నారు. అందుకే కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల అనంతరం అన్ని వర్గాల ప్రముఖులతో కలిసి రాజకీయాలకు అతీతంగా మధిర పట్టణ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ప్రజల సూచనలు, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని డిప్యూటీ సీఎం వివరించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇండస్ట్రియల్ పార్కులో స్థలాల కేటాయింపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి పథకాలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని అన్నారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
మధిరలో భారీ వరదల నివారణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇవి మధిర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని ఆయన పేర్కొన్నారు.
మధిర ప్రజలు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రిగా ఉన్న అవకాశాన్ని మధిర అభివృద్ధికి వినియోగిస్తానని తెలిపారు. ప్రజల అమూల్యమైన ఓటుతో మధిర అభివృద్ధి రథాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
