
మధ్య తరగతికి మధురమైన కానుక
స్వాతంత్య్రం వచ్చిన తరువాత మధ్య తరగతి ప్రజలకు ఇంతటి ఆర్థిక వెసులుబాటు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా పేర్కొన్నారు. సరళీకృత జీఎస్టీపై విశాఖ నగరంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామ రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా కొందరు దుకాణాదారులను కలిసి మాట్లాడారు. ప్రజలతో సైతం మాట్లాడి పలు విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ రాణా మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అందించిన దసరా, దీపావళికి గొప్ప బహుమతి సరళీకృత జీఎస్టీ అని కొనియాడారు. జీఎస్టీ వల్ల ఆనందోత్సాహాలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవిఎన్ మాధవ్ మాట్లాడుతూ స్వదేశీ వస్తువులు వినియోగించాలని పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువుల వాడకం ద్వారా స్థానిక మార్కెట్ బలపడుతుందని మాధవ్ పేర్కొన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ దసరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప కానుక ఇచ్చారన్నారు. అదేవిధంగా దేశ ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు, పేదలపై భారం లేకుండా చేశారన్నారు.
