
మద్యం మాయలో రేవంత్ పాలన
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వేలాదిమందిని మోసగించిందని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసి ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ఒత్తిడిలో ప్రజలకు 6 గ్యారంటీలు, 420 హామీల ఊసు లేదు కానీ మద్యం ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాలకు కోతలు, ప్రజలకు పన్నుల వాతలు తప్ప 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆదాయం పెంచుకునేందుకు అడ్డదారులు వెతుకుతున్నారని, ఈ పాలన వల్ల ప్రజలపై పన్నుల భారం మోపుతోందని తీవ్రంగా విమర్శలు చేశారు.
ఇప్పటికే మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా కొత్త పాలసీ తెచ్చిందన్నారు. ఇప్పుడు మద్యం షాపుల దరఖాస్తు ఫీజును ఏకంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచారని తెలిపారు. అలాగే ఎన్నికలప్పుడు మాయ మాటలు చెప్పి పాలనలోకి రాగానే మోసం చేశారన్నారు. ప్రజలపై ఆర్టీసీ బస్సు చార్జీల మోతలు వాహనాలపై పన్నుల అధిక భారం,మోపడం ఆర్ఆర్ టాక్స్ లు వేయడం, ప్రజలకు సంక్షేమం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దె నెక్కగానే గరీబోళ్ల సంపాదనను కొల్లగొట్టే పథకాలు తెస్తున్నారని వాపోయారు. అలాగే గ్రామాలలో బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని తుంగలో తొక్కి గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారేలా చేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రజలకు మద్యం తాగించడం ఖజానా నింపుకోవడం అనే విధానం రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడన్నారు. అందుకోసం అన్ని రకాల మద్యంపై ధరలు పెంచారని, కేసిఆర్ హయాంలో మద్యం ధరలు ఈ విధంగా పెంచలేదని చెప్పారు. మద్యం అమ్మకాలు పెరగాలని అధికారులపై ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నారని మద్యం అమ్మకాలు టార్గెట్ రీచ్ కాలేదని అధికారులకు మెమోలు ఇచ్చిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం తప్పదనే రీతిలో ఆనాడు బిల్డప్ ఇచ్చి ఈనాడు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వలేదన్నారు. విద్యార్థినులకు స్కూటీలు వంటివి ఏమీ చేయకుండా బెల్ట్ షాపులు పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో గౌడ సోదరులకు వైన్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్లు అని ఊదరగొట్టి .. కేసీఆర్ ఇచ్చిన 15 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వడం లేదన్నారు. నీరాను ప్రోత్సహిస్తామని తెలిపి ఉన్న నీరా షాపును బంద్ చేసే కుట్ర చేశారని, వారం రోజుల్లో నష్టపరిహారం ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గీత కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ఇచ్చే నష్టపరిహారాన్ని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెలించలేదన్నారు. గౌడన్నలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అలాగే రాత్రికి రాత్రే మద్యం షాపులు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే వెసులుబాటు ఎందుకు కల్పించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పల్లెపల్లెకు మద్యం చేర్చడంపై ఉన్న శ్రద్ధ పల్లెపల్లెకు వైద్యాన్ని అందించడంపై లేదన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లను విచ్చలవిడిగా అనుమతించి మద్యం ఆదాయం పెంచుకోవాలనే స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందన్నారు. వందలకొద్దీ కొత్త బ్రాండ్లు వస్తున్నాయి అంటున్నారు, అడ్డగోలుగా బ్రాండ్లను పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు యూరియా ఇవ్వరు కానీ ఊరి ఊరికో మద్యం దుకాణం ఇస్తాం తీసుకోండి అంటోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి బరితెగింపు పాలనకు నిదర్శనం అని విమర్శించారు. అలాగే రేవంత్ రెడ్డి ఓ యూ టర్న్ సీఎం అని, ఎన్నికల్లో చెప్పిందొకటి ఇప్పుడు చేస్తున్నది మరొకటని, మూర్ఖపు ఆలోచన మానుకోవాలని, లేదంటే వచ్చే ఎన్నికలల్లో ప్రజలే గుణపాఠం చెప్పుతారని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.
