Let's talk: editor@tmv.in
మద్యం మత్తులో విధులకు ఎయిర్ ఇండియా పైలట్.. విచారణకు ఆదేశించిన కెనడా

మద్యం మత్తులో విధులకు ఎయిర్ ఇండియా పైలట్.. విచారణకు ఆదేశించిన కెనడా

Shaik Mohammad Shaffee
3 జనవరి, 2026

ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఒక ఆందోళనకరమైన విషయం కెనడాలో వెలుగులోకి వచ్చింది. వాంకూవర్ విమానాశ్రయంలో ఒక ఎయిర్ ఇండియా పైలట్ మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడన్న ఆరోపణలపై కెనడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఏం జరిగింది?

కెనడా రవాణా శాఖ (ట్రాన్స్‌పోర్ట్ కెనడా) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన 2025 డిసెంబర్ 23న జరిగింది. వాంకూవర్ నుంచి వియన్నాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ-186లో విధులు నిర్వహించాల్సిన కెప్టెన్ సౌరభ్ కుమార్ మద్యం సేవించి డ్యూటీకి వచ్చినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై డిసెంబర్ 24, 2025న ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులకు 'ట్రాన్స్‌పోర్ట్ కెనడా' లేఖ రాసింది. విధుల్లో చేరే సమయంలో పైలట్ మద్యం సేవించి ఉన్నారని, ఆయన విమానం నడపడానికి ఏమాత్రం అర్హుడు కాదని కెనడా పోలీసులు ధృవీకరించినట్లు ఆ లేఖలో పేర్కొంది. పోలీసులు వాంకూవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు సార్లు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా… పైలట్ మద్యం మత్తులో ఉన్నట్టు స్పష్టంగా తేలిందని తెలిపింది. ఆ తర్వాత అతడిని విమానం నుంచి దిగిపోవాలని సూచించారు.

కెనడా ప్రభుత్వ హెచ్చరిక

ట్రాన్స్‌పోర్ట్ కెనడా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన కెనడా విమానయాన నిబంధనలను (కార్స్) తీవ్రంగా ఉల్లంఘించడమే. ముఖ్యంగా 'కార్స్ 602.02, 602.03 నిబంధనలతో పాటు, ఎయిర్ ఇండియాకు జారీ చేసిన 'విదేశీ విమాన నిర్వాహక సర్టిఫికెట్‌లోని షరతులను కూడా ఈ ఉదంతం తుంగలో తొక్కిందని పేర్కొంది.

ఈ వ్యవహారంపై కెనడా పోలీసులతో పాటు కెనడా సివిల్ ఏవియేషన్ అథారిటీ చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రాన్స్‌పోర్ట్ కెనడా హెచ్చరించింది. అంతేకాదు, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణ సరిదిద్దు చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ జనవరి 26 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, విచారణ ఫలితాలను వివరించాలని కెనడా అధికారులు కోరారు.

పైలట్ నిర్ణయాలపై డీజీసీఏ ఆగ్రహం

ఇదిలా ఉండగా, ఇదే సమయంలో భారత్‌లో కూడా ఎయిర్ ఇండియాపై విమాన భద్రతకు సంబంధించిన మరో వివాదం నెలకొంది. డిసెంబర్ 31న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ఎయిర్ ఇండియా పైలట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఏఐ-358, ఏఐ-357 విమానాల ప్రయాణ సమయంలో భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంది. ముఖ్యంగా విమాన ప్రయాణానికి ముందు ఉండాల్సిన కనీస పరికరాల జాబితాను సరిచూసుకోకపోవడం, విమాన నిర్వహణలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంపై డీజీసీఏ మండిపడింది. విమానంలో పదేపదే సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, సిస్టమ్స్ సరిగ్గా పనిచేయడం లేదని తెలిసినప్పటికీ.. సదరు పైలట్ ఆ విమానాన్ని నడపడానికి అంగీకరించారని డీజీసీఏ తన నోటీసులో తీవ్రంగా తప్పుబట్టింది. ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టి తీసుకున్న ఇటువంటి నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రమాదంలో ప్రయాణికుల భద్రత

వరుసగా జరుగుతున్న ఇటువంటి సంఘటనలు ఎయిర్ ఇండియాలోని భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పైలట్ల బాధ్యతారాహిత్యం వల్ల వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, అంతర్జాతీయంగా మరియు దేశీయంగా విమాన ప్రయాణ భద్రతను మెరుగుపరచడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.