Let's talk: editor@tmv.in
మద్యం మత్తులో వాహనం నడిపి.. వార్నర్ అరెస్ట్!

మద్యం మత్తులో వాహనం నడిపి.. వార్నర్ అరెస్ట్!

Shaik Mohammad Shaffee
8 ఏప్రిల్, 2026

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డారు. మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసులకు పట్టుబడ్డారు. సిడ్నీలోని మరూబ్రా ప్రాంతంలో ఆదివారం రాత్రి నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో వార్నర్ మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

తనిఖీలను చూసి తప్పించుకునే ప్రయత్నం

న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఆదివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో మరూబ్రాలోని మలబార్ రోడ్డుపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వార్నర్ ప్రయాణిస్తున్న వాహనం తనిఖీ కేంద్రానికి కొద్ది దూరంలోనే ఆగిపోయింది. పోలీసులను చూసి తప్పించుకునే ఉద్దేశంతోనే ఆయన వాహనాన్ని పక్కకు ఆపి ఉంటారని అనుమానించిన ట్రాఫిక్ పోలీసులు.. వెంటనే అక్కడికి వెళ్లి వార్నర్‌కు బ్రీత్ టెస్ట్ నిర్వహించారు. ప్రాథమిక పరీక్షలో పాజిటివ్ రావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

పరిమితికి మించి రెట్టింపు రీడింగ్

అరెస్ట్ చేసిన అనంతరం వార్నర్‌ను మరూబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించి రెండోసారి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో మద్యం స్థాయి 0.104గా నమోదైంది. ఆస్ట్రేలియాలో అనుమతించదగిన సాధారణ పరిమితి కంటే ఇది దాదాపు రెట్టింపు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ పోలీసు అధికారులు ఆయనకు 'ఫీల్డ్ కోర్ట్ అటెండెన్స్ నోటీసు' జారీ చేశారు. మే 7, 2026 (గురువారం) నాడు సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో వార్నర్ హాజరు కావాల్సి ఉంటుంది.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజం

39 ఏళ్ల డేవిడ్ వార్నర్ 2024 జూన్ 24న అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ఆయనకు చివరిది. అంతకుముందే 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డేలకు, 2024 జనవరిలో టెస్టు క్రికెట్‌కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. మైదానంలో పరుగుల వరద పారించి ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించిన ఈ లెజెండరీ బ్యాటర్, ఇప్పుడు మద్యం మత్తులో వాహనం నడిపి వార్తల్లో నిలవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.