Let's talk: editor@tmv.in
మద్యం నిషేధం పేరుతో మహా దోపిడీ: రూ. 3,500 కోట్ల కుంభకోణంపై లోకేష్ ధ్వజం

మద్యం నిషేధం పేరుతో మహా దోపిడీ: రూ. 3,500 కోట్ల కుంభకోణంపై లోకేష్ ధ్వజం

Panthagani Anusha
8 మార్చి, 2026

గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థీకృత రీతిలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, ఇందులో దాదాపు రూ.3,500 కోట్ల మేర అవినీతి చోటుచేసుకుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ స్కామ్‌లో నెలకు రూ.100 కోట్ల చొప్పున ముడుపులు అందాయని ఇప్పటివరకు రూ.1,048 కోట్ల నగదు జాడను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు.

కాగా ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిందని ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి తదితరులకు చెందిన రూ. 441 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ శుక్రవారం అటాచ్ చేసిందని తెలిపారు. జప్తు చేసిన వాటిలో నిందితుల బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు పలు భూములు, స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు. అధికార ముసుగులో సాగిన ఈ దోపిడీ అప్పట్లో రాష్ట్ర ఖజానాకు గండి కొట్టిందని మండిపడ్డారు.

2019 ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన 'మద్య నిషేధం' హామీని లోకేష్ ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ జగన్ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన మీ వాగ్దానం వెనుక ఉన్న అసలు కథ ఇదేనా?" అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు నిషేధం అంటూనే మరోవైపు అక్రమ మద్యం ద్వారా వేలాది కుటుంబాలను నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కంటే తన అనుచరుల జేబులు నింపడానికే జగన్ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు.

ఇక ఈ భారీ కుంభకోణంపై జగన్ మోహన్ రెడ్డి మౌనం వీడాలని లోకేష్ డిమాండ్ చేశారు. నెలకు రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? రూ.3,500 కోట్ల మనీలాండరింగ్‌పై సమాధానం ఉందా? లేక మౌనమే మీ రక్షణ కవచమా? అంటూ నిలదీశారు. ఈ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని బాధ్యులెవరూ తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. అక్రమ మద్యం దందాతో పేదల జీవితాలతో ఆడుకున్న వారికి తగిన శాస్తి జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.