
మద్యం కేసులో ఎంపీ మిథున్‌కు బెయిల్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద రిలీఫ్ దక్కింది.. తెలుగుదేశం ప్రభుత్వం రూ. 3500 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న కేసులో అరెస్ట్ అయి దాదాపు రెండునెలలుగా రాజమండ్రి జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఎసిబి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది వైయస్సార్ సీపీ కార్యకర్తలకు పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు.
ఈ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఐదో నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది జులై 21న మిథున్ రెడ్డి అరెస్టు అయ్యారు. మధ్యలో ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటేసేందుకు ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిలు ద్వారా బయటకు వచ్చిన మిథున్ రెడ్డి మొత్తం 71 రోజులు జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చాక వారంలో రెండు సార్లు విచారణకు హాజరుకావాలని కోర్టు షరతులు విధించింది. అదేవిధంగా బెయిలు కోసం రెండు ష్యూరిటీలు సమర్పించాలని చెప్పింది.
మద్యం కేసులో మొత్తం 12 మందిని అరెస్టు చేయగా, ఇంతకు ముందు మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, వైయస్ జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డికి ఇప్పటికే డిఫాల్ట్ బెయిలు దక్కింది. తాజాగా మిథున్ రెడ్డికి బెయిలు మంజూరు చేయడం కీలక పరిణామంగా చెబుతున్నారు. అయితే మిథున్ రెడ్డికి బెయిలు మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని సిట్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఇంకా వీరిలో కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, చెవిరెడ్డికి ఇంకా జైల్లోనే ఉన్నారు.. వారికీ బెయిల్ రాలేదు. గత ప్రభుత్వంలో రూ.3,500 కోట్ల మేర మద్యం స్కాం చేశారని మిథున్ రెడ్డితోపాటు మిగిలిన నిందితులపై సిట్ అభియోగాలు నమోదైంది. మొత్తం 48 మంది వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో చేర్చగా, 12 మందిని అరెస్టు చేశారు.
