
మదురో ఘటనపై యూఎన్ఎస్సీ అత్యవసర భేటీ
వెనిజువెలాలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలు, పదవీచ్యుతుడైన అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యతో కలిసి అరెస్ట్ చేయడంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ ) ఈ రోజు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.
భద్రతామండలి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సమావేశం సోమవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.30 గంటలకు) జరగనుంది. సమావేశ అజెండాగా అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పులుగా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో సోమాలియా శాశ్వత ప్రతినిధి కార్యాలయ ప్రతినిధి ఖదీజా అహ్మద్ వెల్లడించారు. జనవరి నెలకు సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన భద్రతామండలికి సోమాలియా అధ్యక్ష దేశంగా వ్యవహరిస్తోంది. ఇందులో ఐదుగురు శాశ్వత సభ్యులు కాగా, 10 మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు.
కొలంబియా అధ్యక్షుడి విజ్ఞప్తి
వెనిజువెలాపై అమెరికా దాడుల అనంతరం అత్యవసర యూఎన్ఎస్సీ సమావేశం కోరిన తొలి దేశంగా కొలంబియా నిలిచింది. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో వెల్లడించారు. వెనిజువెలా, లాటిన్ అమెరికా సార్వభౌమాధికారంపై జరిగిన దాడిని కొలంబియా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజల మధ్య అంతర్గత వివాదాలు శాంతియుతంగా, ఆ ప్రజలే పరిష్కరించుకోవాలి. ఇదే ప్రజల స్వయంప్రతిపత్తి సూత్రం. ఇది ఐక్యరాజ్యసమితి వ్యవస్థకు పునాది అని పెట్రో వ్యాఖ్యానించారు.
ట్రంప్ ప్రకటన
శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజువెలాపై భారీ స్థాయిలో సైనిక దాడి నిర్వహించామని ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో నికోలస్ మదురోను, ఆయన భార్యను అరెస్ట్ చేసి దేశం వెలుపలికి తరలించామని చెప్పారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో మదురోను అమెరికా నౌక యూఎస్ఎస్ ఐడబ్ల్యూవో జిమాపై తీసుకువెళ్తున్న ఫోటోను కూడా పోస్టు చేశారు.
గుడ్ నైట్
వైట్ హౌస్‌కు అనుబంధంగా ఉన్న ర్యాపిడ్ రెస్పాన్స్ విభాగం విడుదల చేసిన వీడియోలో, మదురోను చేతికి కట్టిన కట్లతో (హ్యాండ్‌కఫ్స్) పోలీసులు తీసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో మదురో, భద్రతా సిబ్బందిని ఉద్దేశించి ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘గుడ్ నైట్’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
గుటెర్రస్ ఆందోళన
ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెనిజువెలా పరిస్థితులు మొత్తం ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. తన ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో
వెనిజువెలాలో పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ ఈ తరహా చర్యలు ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తాయి. అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించాలని గుటెర్రస్ పేర్కొన్నారు.
కారాకస్‌లో రాజకీయ పరిణామాలు
మదురో అరెస్టు అనంతరం వెనిజువెలా రాజధాని కారాకస్‌లో వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వెనిజువెలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ను తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరింది.మదురో ప్రస్తుతం తన విధులను నిర్వహించలేని తాత్కాలిక, వాస్తవిక అసమర్థత స్థితిలో ఉన్నారని కోర్టు పేర్కొంది.
