Let's talk: editor@tmv.in
మదురోపై ‘నార్కో-టెర్రర్’ కేసు కొట్టివేతకు అమెరికా కోర్టు నిరాకరణ

మదురోపై ‘నార్కో-టెర్రర్’ కేసు కొట్టివేతకు అమెరికా కోర్టు నిరాకరణ

Shaik Mohammad Shaffee
28 మార్చి, 2026

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోపై నమోదైన మత్తుపదార్థాల ఉగ్రవాద అభియోగాలను (నార్కో-టెర్రరిజం ఇండైట్‌మెంట్) కొట్టివేయడానికి అమెరికా ఫెడరల్ కోర్టు ప్రస్తుతానికి నిరాకరించింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా బలగాల చేతికి చిక్కిన మదురో ప్రస్తుతం అక్కడి జైలులోనే ఉన్నారు. తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ మదురో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సీనియర్ జడ్జి ఆల్విన్ హెల్లర్‌స్టెయిన్, ఇప్పుడే కేసును రద్దు చేయలేమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణకు ఆదేశించారు.

ఖర్చుల చెల్లింపుపై వివాదం

మదురో తరఫున వాదిస్తున్న రక్షణ బృందం ఈ కేసులో ఒక కీలక వాదనను తెరపైకి తెచ్చింది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల కారణంగా మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ తరఫున న్యాయపోరాటం చేయడానికి వెనిజులా ప్రభుత్వం ఫీజులు చెల్లించలేకపోతోందని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ ఫీజులు అందకుండా ఆంక్షలు అడ్డుపడుతున్నాయని, ఈ పరిస్థితుల్లో కేసును కొనసాగించడం భావ్యం కాదని రక్షణ పక్షం వాదించింది.

ట్రంప్ ప్రభుత్వంపై న్యాయమూర్తి ప్రశ్నలు

ఈ వాదనలపై స్పందించిన జడ్జి హెల్లర్‌స్టెయిన్.. మదురో గద్దె దిగిన తర్వాత వెనిజులాతో సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో కూడా, మదురో న్యాయపరమైన ఖర్చుల చెల్లింపును ట్రంప్ యంత్రాంగం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా చేయడం ద్వారా నిందితుడికి సరైన న్యాయవాదిని ఎంచుకునే అవకాశం లేకుండా చేయడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ న్యాయవాది వాదన

మరోవైపు అమెరికా ప్రాసిక్యూటర్లు ప్రభుత్వ ఆంక్షలను సమర్థించే ప్రయత్నం చేశారు. నిందితుల దంపతులు సొంతంగా ఫీజులు చెల్లించలేకపోతే, వారికి కోర్టు తరఫున 'పబ్లిక్ డిఫెండర్'ను (ప్రభుత్వ న్యాయవాది) కేటాయించవచ్చని సూచించారు. అయితే ప్రాసిక్యూటర్ల ఈ వాదనపై న్యాయమూర్తి పెదవి విరిచారు. నిందితుడికి తన సొంత నిధులతో న్యాయవాదిని పెట్టుకునే హక్కును కాలరాయడం సరికాదనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

కేసు కొట్టివేతపై ఆశాభావం

ట్రంప్ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే మదురో తన న్యాయవాదికి ఫీజు చెల్లింపులు చేయకుండా అడ్డుకుంటోందని భవిష్యత్తులో నిర్ధారణ అయితే, అప్పుడు ఈ కేసు కొట్టివేత అంశాన్ని మళ్లీ పరిశీలిస్తానని జడ్జి తెలిపారు. ఇది మదురో దంపతులకు కొంత ఊరటనిచ్చే విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే,నిధుల విడుదలకు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో సాంకేతిక కారణాలతో కేసు వీగిపోయే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అపహరణ నుంచి జైలు వరకు

జనవరిలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య మదురో, ఆయన సతీమణి ఫ్లోరెస్‌లను అమెరికా బలగాలు అపహరించి బంధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో జరిగిన తొలి విచారణలోనే తమపై వచ్చిన ఆరోపణలను ఈ దంపతులు పూర్తిగా తోసిపుచ్చారు. తాము ఎటువంటి నేరం చేయలేదని 'నోట్ గిల్టీ'గా ప్లీడ్ చేశారు. ప్రస్తుతం రెండో విచారణ ముగియగా, వెనిజులా మాజీ అధ్యక్షుడి భవితవ్యం ఇప్పుడు అమెరికా కోర్టు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.