Let's talk: editor@tmv.in
మదీనా బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

మదీనా బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
1 మార్చి, 2026

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితుల కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. నవంబర్ 17, 2025న మదీనా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 44 మంది యాత్రికులు సజీవదహనమైన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన ఒకరి కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం మంజూరు చేసినట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విదేశాల్లో జరిగే ప్రమాదాల్లో మృతిచెందిన వారికి సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించే విధానం లేకపోయినా, మానవతా దృక్పథంతో సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజలదేనని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని, బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని మదీనాకు పంపినట్లు గుర్తుచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణమే పాస్‌పోర్టులు, వీసాలు జారీ చేసి మదీనాకు పంపించామని చెప్పారు. అక్కడి భారత కాన్సులేట్, సౌదీ ప్రభుత్వంతో చర్చించి, మృతదేహాల అంత్యక్రియలను జన్నతుల్ బఖీ సమాధి స్థలంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం పరిహారం అందించిందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, 2009లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతి ఏడాది తన సొంత ఖర్చుతో అయిదుగురిని హజ్ యాత్రకు పంపిస్తున్నానని తెలిపారు. వారిని ఎంపిక చేసే బాధ్యత స్థానిక ముస్లిం మత పెద్దలకు అప్పగించినట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, హజ్ కమిటీ, మైనారిటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.