Let's talk: editor@tmv.in
మదనపల్లి హత్యాచారం కేసు: సంచలన మలుపు.. చెరువులో నిందితుడి శవం!

మదనపల్లి హత్యాచారం కేసు: సంచలన మలుపు.. చెరువులో నిందితుడి శవం!

Dantu Vijaya Lakshmi Prasanna
19 ఫిబ్రవరి, 2026

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నీరుగట్టువారపల్లిలో చిన్నారిపై జరిగిన అమానుష హత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కులవర్ధన్ బుధవారం ఉదయం చెరువులో శవమై కనిపించడం మరోసారి కలకలం రేపింది. ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ ధీరజ్ మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు.

ఘటన నేపథ్యం..

బాలిక అదృశ్యంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో నిందితుడు కులవర్ధన్ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా, అక్కడ నిందితుడు ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో ఇంటి పక్కనే ఉన్న నీటి డ్రమ్‌లో బాలిక మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర విషాదం అలుముకుంది.

గ్రామస్తుల ఆగ్రహం - పోలీసుల రక్షణ

బాలిక మృతదేహం లభ్యమైన విషయం తెలియగానే సుమారు 50 మందికి పైగా గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన జనం నిందితుడిపై దాడికి ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే నిందితుడిని రక్షక్ వాహనంలో ఎక్కించి అక్కడి నుండి తరలించారు.

కన్నీటి వీడ్కోలు

మరోవైపు, హత్యాచారానికి గురైన చిన్నారి అంత్యక్రియలు బుధవారం ఉదయం ఆమె స్వగ్రామమైన కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో నిర్వహించారు. అంత్యక్రియలకు బంధువులు, స్థానికులు, అన్నమయ్య, కడప జిల్లాల టీడీపీ నేతలు హాజరయ్యారు. అందరూ కన్నీటితో బాలికకు చివరి వీడ్కోలు పలికారు . కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రమైంది. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

నిందితుడి మృతిపై సంచలనం

అంత్యక్రియలకు ముందే, ఈ కేసులో నిందితుడు కులవర్ధన్ మృతిచెందాడు. అన్నమయ్య జిల్లా కరసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాలిక అంత్యక్రియలకు ముందే నిందితుడు కులవర్ధన్ మరణంపై మృతురాలి బంధువులు హర్షం వ్యక్తం చేశారు.

అసలు పోలీసుల అదుపులో ఉన్నాడని భావించిన నిందితుడు కులవర్ధన్, అనూహ్యంగా చెరువులో మృతదేహంగా కనిపించడం ఇప్పుడు అనేక సందేహాలకు దారితీస్తోంది. అతను పోలీసుల నుండి తప్పించుకున్నాడా లేదా మరేదైనా జరిగిందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది.ఈ కేసులో నిందితుడి మృతికి గల కారణాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.