
మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న ఓ పసిమొగ్గ కామాంధుడి వికృత చేష్టలకు బలైపోయింది. నిన్న సాయంత్రం అదృశ్యమైన ఏడేళ్ల బాలిక చివరకు విగతజీవిగా ఓ డ్రమ్ములో కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
పట్టణంలోని కాట్లాటపల్లి రోడ్డులో నివసించే చేనేత కార్మికుడి కుమార్తె (7), సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పక్కింట్లో నివసించే ఓ వ్యక్తి బాలికను మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లినట్లు దృశ్యాల్లో రికార్డయ్యింది. వెంటనే పోలీసులు ఆ ఇంట్లో తనిఖీలు చేపట్టగా ఒక డ్రమ్ములో బాలిక మృతదేహం లభ్యమైంది.
అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం
ఇదిలా ఉండగా బాలికపై నిందితుడు తొలుత అఘాయిత్యానికి పాల్పడి ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి దాచిపెట్టాడు. ఈ వార్త తెలియగానే ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, బాధితురాలి బంధువులు నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గంటల తరబడి మృతదేహాన్ని తరలించనివ్వకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు మదనపల్లి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కూటమి ప్రభుత్వ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన 'దిశ' యంత్రాంగాన్ని, దిశ యాప్‌ను ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దిశ పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ చిన్నారి ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మహిళలు, చిన్నారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైకాపా నేతలు విమర్శించారు. కేవలం రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇస్తూ ప్రజల భద్రతను విస్మరించారని హోంమంత్రిని ప్రశ్నించారు. ఇక నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణమే కఠిన శిక్ష పడేలా చూడాలని బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
