Let's talk: editor@tmv.in
మాదక ద్రవ్యాలకు కేంద్రంగా భారత్!

మాదక ద్రవ్యాలకు కేంద్రంగా భారత్!

Venkatesh Balusula
19 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న కీలక దేశాల జాబితాలో భారత్ను చేర్చారు. అక్రమ డ్రగ్ తయారీ, రవాణాకు కేంద్రంగా నిలుస్తున్న దేశాల జాబితాను ట్రంప్ సెప్టెంబరు 15న అమెరికన్ కాంగ్రెస్కు అందజేశారు. ఇందులో భారత్తో పాటు చైనా, పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ వంటి 23 దేశాల పేర్లు ఉన్నాయి.

అమెరికా నిఘా వర్గాల కీలక నివేదిక

ట్రంప్ విడుదల చేసిన జాబితాలో భారత్ సహా మిగతా దేశాలు అక్రమంగా మాదక ద్రవ్యాలు, వాటి తయారీలో ఉపయోగించే రసాయనాలు తయారు చేస్తూ, అమెరికాకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇవి అమెరికా ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో మత్తుపదార్థాల నిల్వలు, ఉత్పత్తి ఇంకా కొనసాగుతోందని, ఆఫ్గనిస్తాన్ మాదక ద్రవ్యాల ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చుకుంటోందని ఆరోపించారు. ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం డ్రగ్ తయారీకి ఉపయోగించే కొన్ని కీలక రసాయనాల తయారీ, సరఫరాలో భారత్, చైనా కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ట్రంప్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ఎత్తిచూపింది. అయితే ఈ జాబితాలో భారత్ పేరు ఉండటం ఆందోళనకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డ్రగ్ సరఫరా దేశాల జాబితాలో భారత్ను చేర్చడం ట్రంప్ రాజకీయ ఎత్తుగడగా కూడా భావించవచ్చు.

రాజకీయ వ్యూహంతోనే ఆరోపణలు

అమెరికాలో యువత భారీ సంఖ్యలో మాదక ద్రవ్యాలకు బానిసగా మారుతున్నారు. ఇది ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తుండటంతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇతర దేశాలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వాణిజ్యపరంగా వ్యతిరేకంగా ఉన్న భారత్, చైనా వంటి దేశాలను ఈ జాబితాలో చేర్చడం ద్వారా అమెరికా ప్రజల్లో ఆయా దేశాలపై వ్యతిరేకత తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు. ట్రంప్ చర్యలతో భారత్పై అమెరికా నిఘా పెరగనుంది. అమెరికాతో సహకారం, రసాయనాల ఎగుమతులపై నియంత్రణలు, పర్యవేక్షణ పెరుగుతుంది. అంతర్జాతీయంగా భారత్కు నష్టం జరిగే అవకాశం ఉంది. భారత్, అమెరికా సంబంధాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే రష్యా చమురు కొనుగోళ్లతో భారత్పై సుంకాల భారం మోపిన ట్రంప్, మాదక ద్రవ్యాల ఆరోపణలతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మాదక ద్రవ్యాలకు కేంద్రంగా భారత్! - Tholi Paluku