
మథురలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన భారీ వాహనాలు ఒకదానికొకటి (గొలుసు) ఢీకొన్న సంఘటనలో 13 మంది కాలిన గాయాలతో మృతి చెందగా, 35 మంది గాయపడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 4.30 గంటలకు, మథుర జిల్లా పరిధిలోని బాల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల ప్రకారం, ఆగ్రా నుంచి నోయిడా వైపు వెళ్తున్న యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై దట్టమైన పొగమంచు కారణంగా సరిగా కనబడకపోవడంతో ఎనిమిది బస్సులు, మూడు చిన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీకొన్న వెంటనే కొన్ని వాహనాలు మంటల్లో చిక్కుకుని ఘోర అగ్నిప్రమాదంగా మారాయి.
మథుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ మాట్లాడుతూ, దట్టమైన పొగమంచు వల్ల వాహనదారులకు ముందున్న వాహనాలు కనిపించలేదు. దీని వల్ల ఈ ప్రమాదం జరిగింది. కొన్ని వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. గాయపడిన వారందరినీ ఆసుపత్రులకు తరలించామని తెలిపారు.
బాల్దేవ్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రంజనా సచ్చాన్ తెలిపిన వివరాల ప్రకారం,
మృతి చెందిన వారిలో ఇప్పటివరకు గుర్తించినవారు:
అఖిలేంద్ర ప్రతాప్ యాదవ్ (44) – ప్రయాగ్‌రాజ్ నివాసి, రాంపాల్ (75) – మహారాజ్‌గంజ్ జిల్లా నివాసి మృతి చెందిన 13 మంది కాలిన గాయాల వల్లే మరణించారని ఆమె స్పష్టం చేశారు.
గాయపడినవారి వివరాలు
గాయపడిన వారిలో 15 మందిని మథుర జిల్లా ఆసుపత్రికి, 9 మందిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, 9 మందిని బాల్దేవ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఇద్దరిని ఆగ్రాలోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరి పరిస్థితి విషమంగా లేదు. ఘటనా స్థలానికి సంబంధించిన దృశ్యాల్లో, బస్సులు, కార్లు పూర్తిగా కాలిపోయి ఇనుప ముక్కలుగా మారినట్లు కనిపించాయి. క్రేన్ల సహాయంతో రహదారి నుంచి కాలిపోయిన వాహనాలను తొలగించారు.పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను వారి బంధువుల వివరాలతో సరిపోల్చేందుకు డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. ఇప్పటివరకు ముగ్గురు మృతులను గుర్తించాం. వారి కుటుంబాలను సంప్రదించి అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నాం. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని శ్లోక్ కుమార్ తెలిపారు.
మథుర జిల్లా కలెక్టర్ చంద్ర ప్రకాష్ సింగ్ మాట్లాడుతూ గుర్తించిన మృతుల అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. మథుర పోలీసుల ఎక్స్ ఖాతాలో చేసిన ప్రకటన ప్రకారం, మైలురాయి 127 వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడు బస్సులు, మూడు చిన్న వాహనాలు ఉన్నాయి. గాయపడిన వారిలో ఎవరి పరిస్థితి ప్రస్తుతం సీరియస్‌గా లేదని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ క్షతగాత్రుడు మాట్లాడుతూ బస్సు ఢిల్లీకి వెళ్తోంది. తీవ్రమైన పొగమంచు ఉంది. చాలా మంది చనిపోయారు. నాకు వెన్నెముక విరిగిందని చెప్పారు.
ప్రమాదానికి గురైన ప్రయాణికులను ప్రభుత్వ వాహనాల ద్వారా వారి గమ్యస్థానాలకు పంపించారని ఎస్ఎస్పీ తెలిపారు. రహదారి పూర్తిగా మూసుకుపోయినందున ట్రాఫిక్ మళ్లింపులు (డైవర్షన్లు) ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి స్పందన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ హిందీలో ఎక్స్‌లో పోస్టు చేశారు. మథుర జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ఆయన అన్నారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా జిల్లా అధికారులను ఆదేశించాను. పరమాత్మ శ్రీరాముడు మృతుల ఆత్మలకు శాంతి కలిగించి, గాయపడిన వారికి త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సంఘటనపై కూడా పీఎం నరేంద్ర మోడీ కూడా దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మరణించినవారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామన్నారు.
ఇతర ప్రమాదాలు
ఇదే విధంగా, పొగమంచు కారణంగా సోమవారం కూడా హర్యానా రాష్ట్రంలోని సోనిపట్, నూహ్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. నూహ్ జిల్లాలో ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై జరిగిన ప్రమాదంలో ఒక సీఐఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు మరణించారు. సోనిపట్‌లో, విధి నిర్వహణకు వెళ్తున్న ఒక మహిళా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
