
మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని కఠినంగా శిక్షించాలి: మాయావతి
పది మంది ముస్లిం అమ్మాయిలను తీసుకురండి, దగ్గరుండి పెళ్లి చేస్తా, తర్వాత జీవనోపాధికి ఉద్యోగం కల్పిస్తా అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మంగళవారం తీవ్రంగా విమర్శించారు. వారు ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో మత, కుల ఆధారిత ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంగా, విద్వేషపూరిత ప్రసంగంగా అభివర్ణించారు.
సిద్ధార్థనగర్ జిల్లాలో జరిగిన ఒక ప్రజాసభలో ప్రతాప్ సింగ్ కనీసం పది మంది ముస్లిం అమ్మాయిలను తీసుకురండి. నేను మీకు పెళ్లి చేయిస్తాను. ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఉద్యోగం కూడా ఇస్తాను అని చెప్పినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మాయావతి ఎక్స్ (ట్విట్టర్) లో తీవ్రంగా స్పందించారు. అది విద్వేష ప్రసంగమని, మతాలు, వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమని పేర్కొన్నారు.
‘ముస్లిం అమ్మాయిని తీసుకురండి ఉద్యోగం తీసుకోండి’ వంటి వ్యాఖ్యలు సంకుచిత మనస్తత్వానికి ప్రతీకలు మాత్రమే కాకుండా, సమాజంలో విషం చిమ్మే ప్రయత్నాలన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో కొన్ని దుష్ట మూకలు మత మార్పిడి, లవ్ జిహాద్ పేర్లతో అల్లర్లు రేపేందుకు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది అత్యంత ఖండించతగిన విషయం అని మాయావతి వివరించారు. ఇలాంటి క్రిమినల్, అశాంతి సృష్టించే మూకలు రాజ్యాంగపరమైన, నాగరిక పాలనకు సవాలుగా నిలుస్తున్నారన్నారు. వీరిని రక్షించకుండా ప్రభుత్వాలు కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడానికి, సంపద, రక్షణ కు ఇది అత్యవసరం అని హితవు పలికారు.
ఈ ఘటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. పలు సామాజిక సంస్థలు కూడా రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ, పోలీసు అధికారులను తక్షణమే కేసు నమోదు చేయాలని కోరాయి. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రజల మతభావాలను రెచ్చగొట్టే ప్రయత్నంగా పరిగణించబడుతున్నాయి. చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
